
TS News: ధాన్యం విషయంలో తెరాస వైఖరిని బహిర్గతం చేయాలి: భాజపా నేతలకు అమిత్‌షా సూచన
దిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెలంగాణ భాజపా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రులు, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి తదితరులు అమిత్‌షాతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని అమిత్‌షా ఛాంబర్లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెరాస ఆందోళనల దృష్ట్యా అమిత్‌షాతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ విషయంలో తెరాసను ఎదుర్కొనే వ్యూహాలపై రాష్ట్ర నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.
‘‘భాజపాపై తెరాస చేసే ఆరోపణలు తిప్పికొట్టాలి. నేతలు ప్రజల మధ్య ఉండే కార్యక్రమాలు చేపట్టాలి. ధాన్యం విషయంలో తెరాస వైఖరిని బహిర్గతం చేసేలా కార్యాచరణ రూపొందించాలి. సీఎం కేసీఆర్ చేసే ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పాలి. తెరాస బియ్యం కుంభకోణం, ఇతర అవినీతిని వెలికితీయాలి. కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరంగా చెప్పాలి. ఆయన అవినీతిపై విచారణకు డిమాండ్ చేయండి. ప్రభుత్వాల మధ్య జరిగేది జరుగుతూనే ఉంటుంది. పార్టీ కార్యక్రమాలతో ప్రభుత్వ వ్యవహారాలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో మంచి ఫలితం సాధించారు. ఈటల రాజేందర్‌కు నా అభినందనలు. బండి సంజయ్ పాదయాత్ర తరహాలో ఇతర కార్యక్రమాలు చేపట్టండి’’ అని రాష్ట్ర భాజపా నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో అమిత్ షా ప్రత్యేకంగా 15 నిమిషాలు మాట్లాడారు. తాను తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటిస్తానని అమిత్ షా చెప్పారు. రెండు రోజుల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.