
ఆ ఉత్తర్వులు తీసుకొస్తే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను సన్మానిస్తా: గంగుల కమలాకర్
కరీంనగర్: యాసంగిలో పండే ప్రతి పంట కొనేలా కేంద్రంపై రాష్ట్ర భాజపా నేతలు ఒత్తిడి తేవాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 12 అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తెరాస ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కరీంనగర్‌లో జిల్లాలోని తెరాస ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశం అనంతరం కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలపక్షాన ధర్నా చేసే పరిస్థితిని కేంద్రం తీసుకొచ్చిందన్నారు.
పంట కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేర్వేరుగా చెబుతున్నారని.. దీనిపై స్పష్టత ఇవ్వాలనే ధర్నాలు చేపడుతున్నట్లు చెప్పారు. తమ ఆందోళనకు భాజపా నేతలు కూడా సంఘీభావం తెలపాలన్నారు. యాసంగిలో ఏ పంట అయినా మద్దతు ధర ఇచ్చి కొనేలా కేంద్ర ప్రభుత్వంపై భాజపా నేతలు ఒత్తిడి తేవాలని.. ప్రతి గింజా కొనేలా కేంద్రం నుంచి ఉత్తర్వులు తీసుకొస్తే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను తానే సన్మానిస్తానన్నారు.