Amith shah: పటేల్‌ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ విమోచనం సాధ్యమైంది: అమిత్‌ షా

తెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. భాజపా ఆధ్వర్యంలోతెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. భాజపా ఆధ్వర్యంలో

Updated : 24 Sep 2022 16:12 IST

నిర్మల్‌: పటేల్‌ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ విమోచనం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి  అమిత్‌ షా అన్నారు. నిర్మల్‌లో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించింది. మజ్లీస్‌కు భాజపా భయపడదు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం. కర్ణాటకలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నాం. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయి. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టవా? తెలంగాణలోని ఆదివాసీలు, ఎస్సీల కోసం మా పోరాటం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో లోక్‌సభ సీట్లన్నీ గెలుస్తాం. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అంతిమ దశకు చేరుకుంది. మజ్లీస్‌ను ఓడిస్తేనే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ. మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం. భాజపా మాత్రమే మజ్లిస్‌తో పోరాడుతుంది. మన నినాదాలు హైదరాబాద్‌ వరకు వినిపించాలి. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించాలి’’ అని అమిత్‌ షా పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన ఉత్సవాలు ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సచివాలయానికి వచ్చే సీఎం కావాలని కోరుకుంటున్నారు. నియంత పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి: బండి సంజయ్‌
తెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన వీరులు పైనుంచి చూస్తున్నారని.. ప్రగతి భవన్‌కు భాజపా జయధ్వానాలు వినిపించాలన్నారు. తెలంగాణ విమోచన వీరుల చరిత్రను భవిష్యత్‌ తరాలకు తెలియజేసేందుకే నిర్మల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడదామన్నారు. సర్దార్ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదన్నారు. పటేల్‌ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని.. కేసీఆర్‌ సీఎం అయ్యేవారు కాదన్నారు. తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన ఘనత అమిత్‌ షాకే దక్కుతుందన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని