Ap News: రూ.40కోట్ల సుపారీపై ఈడీ విచారణకు డిమాండ్‌ చేయాలి: తెదేపా ఎంపీలతో చంద్రబాబు

వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, జ్యుడీషియల్‌ విచారణ, జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రపై ఒత్తిడి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

Updated : 27 Nov 2021 18:26 IST

అమరావతి: వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, జ్యుడీషియల్‌ విచారణ, జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రపై ఒత్తిడి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై జగన్‌ ప్రభుత్వం పన్నులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ప్రత్యేక హోదా, 3 రాజధానుల బిల్లు వంటి అంశాలు పార్లమెంట్‌లో లేవనెత్తాలని సమావేశం నిర్ణయించింది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్‌ సరఫరా అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని తీర్మానించారు.

వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడటంపై  ప్రశ్నించాలన్నారు. దేశానికి అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్‌లో వరి పంట వేయొద్దని మంత్రులు ప్రకటించిన అంశాన్ని కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని నిర్ణయించారు. వైఎస్‌ వివేకా హత్యకు సంబంధించి రూ.40కోట్ల సుపారీ, అడ్వాన్స్‌గా కోటి రూపాయల చెల్లింపులపై ఈడీ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేయాలన్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల మళ్లింపు, ఉపాధి హామీ నిధుల మళ్లింపు, ఈఏపీ నిధుల దారి మళ్లింపుపై ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు. బీసీలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కె.రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని