Ts News: కమీషన్లు అడగడం లేదు.. గిట్టుబాటు ధర కల్పించండి: రేవంత్‌రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేఏసీ (జాయింట్‌ యాక్టింగ్‌ కమిటీ)గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెరాస, భాజపా కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న ప్రభుత్వాన్ని

Published : 19 Nov 2021 01:44 IST

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేఏసీ (జాయింట్‌ యాక్టింగ్‌ కమిటీ)గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెరాస, భాజపా కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న ప్రభుత్వాన్ని కమీషన్లు అడగటం లేదని.. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.

‘‘ఇందిరా పార్క్ వద్ద సీఎం కేసీఆర్ రైతుల పక్షాన మాట్లాడుతారో, లేదో అని చూశాం. అక్కడ ఏర్పాట్లు చూసి అవాక్కయ్యాం. ఎవరైనా ఏసీలు పెట్టుకొని ధర్నాలు, దీక్షలు చేస్తారా? రైతుల పక్షాన పోరాటం చేయాలంటే సీఎం కేసీఆర్‌ స్వయంగా అన్నదాతల వద్దకు వెళ్ళాలి. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలి. బండి సంజయ్, కిషన్ రెడ్డి.. దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని నిలదీయాలి. భాజపా, తెరాస కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నట్లు చేస్తూ మధ్యలో రైతులను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ధాన్యం సేకరణపై కార్యాచరణ ఏంటో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు.

23 వరకు సీఎం కేసీఆర్‌కు సమయం..

రేపటి నుంచి 23 వరకు కల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 23 వరకు సీఎం కేసీఆర్‌కు సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని రేవంత్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని