Revanth Reddy: జగన్‌తో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారా?: రేవంత్‌రెడ్డి

నీటి పంపకాల్లో ఎలాంటి వివాదాలు రాకూడదనే ఏపీ పునర్విభజన చట్టంలో అపెక్స్‌ కౌన్సిల్‌ను పొందుపరిచారని...

Updated : 02 Sep 2021 14:08 IST

హైదరాబాద్‌: నీటి పంపకాల్లో ఎలాంటి వివాదాలు రాకూడదనే ఏపీ పునర్విభజన చట్టంలో అపెక్స్‌ కౌన్సిల్‌ను పొందుపరిచారని... కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ బోర్డులను ఏర్పాటు చేసి వాటికి చట్టబద్ధత కల్పించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. 2015లో కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఒప్పందం జరిగిందని.. ఆ ఒప్పందం ఆ ఏడాదికే అని స్పష్టంగా ఉన్నా ఏటా పొడిగించుకుంటూ వెళ్లారని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్‌ ప్రయత్నించడం లేదని రేవంత్‌ ఆరోపించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘2020, మే5న 203 జీవో ద్వారా పోతిరెడ్డిపాడు నీటి తరలింపును 4 టీఎంసీల నుంచి 8కి పెంచారు. సంగంబండ నుంచి రాయలసీమ లిఫ్ట్‌ ద్వారా 3 టీఎంసీలు తరలించేందుకు అనుమతిచ్చారు. రోజూ అదనంగా 11 టీఎంసీలు ఏపీకి అదనంగా తరలించేందుకు సీఎం కేసీఆరే ప్రగతిభవన్‌లో జీవో తయారు చేసి ఏపీ సీఎం జగన్‌కు కానుకగా ఇచ్చారు’’ అని రేవంత్‌ ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి కేసీఆర్‌కు లేఖ రాశారన్నారు. ఏపీ నెలరోజుల్లో 330 టీఎంసీలు తరలించుకుపోతే శ్రీశైలం ఎండిపోతుందని, నాగార్జునసాగర్ నిరుపయోగంగా మారుతుందని.. తద్వారా నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదముందని లేఖలో ఆయన పేర్కొన్నా కేసీఆర్‌ పెడచెవిన పెట్టారని రేవంత్‌ ఆరోపించారు.

కేఆర్‌ఎంబీ సమావేశాలకు ఎన్నిసార్లు ఆహ్వానించినా కేసీఆర్‌ తన రాజకీయ ప్రయోజనాలకు ప్రయత్నించారే తప్ప సమస్యను సూటిగా లేవనెత్తలేదని.. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు యత్నించలేదని విమర్శించారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారా? అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులతో ఆరేళ్లుగా రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని రేవంత్‌ ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని