Revanth Reddy: వ్యూహకర్త సునీల్‌ సూచనలు.. అమిత్‌షా డైరెక్షన్‌.. కేసీఆర్‌ యాక్షన్‌..: రేవంత్‌రెడ్డి

ప్రధాని నరేంద్రమోదీకి మద్దతిచ్చేందుకే పార్లమెంట్ సమావేశాలను తెరాస బహిష్కరించిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో

Updated : 22 Dec 2021 15:41 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి మద్దతిచ్చేందుకే పార్లమెంట్ సమావేశాలను తెరాస బహిష్కరించిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో జరిగిన సమావేశంలో యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలని తెరాస ఎంపీలు కోరలేదన్నారు. యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలని అడగకుండా వానాకాలంలో ఎంత కొంటారో చెప్పాలనడం దారుణమన్నారు. ఏప్రిల్‌లో వచ్చే పంట కొనుగోలే రైతులకు అసలు సమస్య అని చెప్పారు. దిల్లీలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. 

‘కొట్టినట్లు చేయు.. ఏడ్చినట్లు చేస్తా..’

ప్రజల్లో తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని.. ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని రేవంత్‌ చెప్పారు. కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వ్యూహకర్త సునీల్‌ సూచనలతో భాజపా, తెరాస ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సునీల్‌ సూచనలతోనే ధాన్యం అంశాన్ని అడ్డం పెట్టుకుని ‘కొట్టినట్లు చేయు.. ఏడ్చినట్లు చేస్తా’నంటూ ఆ రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ లేదని చెప్పేందుకే ఈ ఎత్తుగడ వేస్తున్నారన్నారు. సునీల్‌కు అమిత్‌షాతో ఉన్న సంబంధమేంటి? గతంలో ఆయన ఎవరితో పనిచేశారు?తదితర విషయాలన్నీ త్వరలో హైదరాబాద్‌లో వెల్లడిస్తానన్నారు. రాజకీయ వ్యూహకర్త చక్రబంధం.. తెరాస, భాజపా రాక్షస క్రీడలో తెలంగాణ రైతులు బలి అవుతున్నారని రేవంత్‌ ఆరోపించారు. తెరాస ఎంపీల పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలను వదిలేసి పారిపోయి మళ్లీ దిల్లీ వచ్చి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అమిత్‌షా డైరెక్షన్‌లో కేసీఆర్‌ నటిస్తున్నారని.. ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 

కాళేశ్వరం, మిషన్‌ భగీరథలో అవినీతి: ఉత్తమ్‌, కోమటిరెడ్డి

ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గత రబీలో 52లక్షల ఎకరాల్లో వరి పండిస్తే ఈసారి వరి వేయొద్దనంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఏడాదిలో పంట మార్పిడి సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. వరిపై ఆంక్షలు పెట్టకుండా ఏవిధంగా దాన్ని మార్కెటింగ్‌ చేయాలనేదానిపై ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పథకాల్లో అవినీతి జరిగిందని ఉత్తమ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతిపై భాజపాలో చర్చ జరిగిందనడం హాస్యాస్పదమని చెప్పారు. తెలంగాణలో జరిగిన అవినీతిపై సీబీఐ, సీవీసీ విచారణకు ఆదేశించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పథకాలను కమీషన్ల కోసం తీసుకొచ్చారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్‌ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని