Updated : 07/09/2021 17:42 IST

KTR: హుజూరాబాద్ ఉపఎన్నిక చాలా చిన్నది.. ఎక్కువగా పట్టించుకోవాల్సిన పని లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస పార్టీపై విపక్షాల విమర్శలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక సహించేది లేదని.. దీటుగా తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. కొంతమంది నేతల మాటలు మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా కేసీఆర్ ముందు వ్యవహరిస్తున్నారని విపక్షాలపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. పేరుకు దిల్లీ పార్టీలైనా.. సిల్లీ పనులు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ భాజపా ఉండేవే కావన్నారు. అన్ని పార్టీలు, నాయకుల చరిత్రలు ప్రజలకు తెలుసునన్నారు. జలవిహార్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ తెరాస విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో తెరాస సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.

‘‘త్వరలో సుమారు 500 నామినేటెడ్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. కష్టపడే పార్టీ కార్యకర్తలకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుంది. హైదరాబాద్ నగర పార్టీ కార్యాలయాన్ని నిర్మించబోతున్నాం. హైదరాబాద్‌లో 150 డివిజన్ కమిటీలతో పాటు 4,800 కాలనీలు, 1,486 బస్తీల్లో పార్టీ కమిటీలు ఉంటాయి. ప్రతి డివిజన్‌కు సోషల్ మీడియా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కమిటీల్లో సుమారు లక్ష మంది కార్యకర్తలకు నాయకత్వం వహించే అవకాశం రాబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఏర్పాటు చేయాలా లేక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌కు వేర్వేరుగా ఏర్పాటు చేయాలా? అనే దానిపై త్వరలోనే తీసుకుంటాం. ఈనెల 20లోగా కమిటీల నిర్మాణం పూర్తి కావాలి. దీపావళి తర్వాత శిక్షణ తరగతులు ఉంటాయి.

హుజూరాబాద్ ఉపఎన్నిక చాలా చిన్నది. దానిని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేదలకు ఏం కావాలో కేసీఆర్‌కు పూర్తిగా తెలుసు. పేదల ఆశీస్సులు ఉంటే తెరాసను ఏ పార్టీ ఏమీ చేయలేదు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా 2001లో పార్టీ పెట్టిన కేసీఆర్.. త్యాగాల పునాదుల మీదనే ఉద్యమాన్ని చేపట్టారు. గతంలో తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది పోరాడినా ఎవరూ సాధించలేక పోయారు. కేసీఆర్‌ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం’’ అని కేటీఆర్‌ వివరించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్