Ts News: తాండూరు తెరాసలో వర్గపోరు.. మంత్రి ఎదుటే వేదికపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాగ్వాదం

వికారాబాద్‌ జిల్లా తాండూరు తెరాసలో వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా

Published : 11 Dec 2021 01:19 IST

తాండూరు: వికారాబాద్‌ జిల్లా తాండూరు తెరాసలో వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే ఇద్దరు నేతలు గొడవకు దిగారు. డీఎంఎఫ్‌టీ నిధుల కింద మంజూరైన దోమల నియంత్రణ యంత్రాలను గ్రామ పంచాయతీలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తాండూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు.. ఛైర్‌పర్సన్‌, కౌన్సిలర్లను ఆహ్వానించలేదని మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాండూరులో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎందుకు సమాచారం ఇవ్వలేదని పాలకవర్గం నిలదీసింది. ఈ క్రమంలో రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి వర్గీయుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. వేదికపైనే రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి మాటల యుద్ధానికి దిగారు. కొంతసేపు ఆందోళనకర పరిస్థితలు నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. వేదికపై ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇరు వర్గాలను సముదాయించారు. ప్రొటోకాల్‌ ప్రకారం కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని