TS News: కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం: కె.కేశవరావు

చట్టసభలను బాయ్‌కాట్‌ చేయడం బాధ కలిగించే విషయమే అని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు(కేకే) అన్నారు.

Updated : 07 Dec 2021 14:01 IST

దిల్లీ: చట్టసభలను బాయ్‌కాట్‌ చేయడం బాధ కలిగించే విషయమే అని.. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు బహిష్కరిస్తున్నామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు(కేకే) అన్నారు. సభలను బాయ్‌కాట్‌ చేయాలని ఎవరూ కోరుకోరని.. కానీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిని ఖండిస్తూ సమావేశాలను బాయ్‌కాట్‌ చేస్తున్నామన్నారు. దిల్లీలో కేకే ఆధ్వర్యంలో తెరాస ఎంపీలు మీడియాతో మాట్లాడారు. 

లోక్‌సభలో 9, రాజ్యసభలో 7మంది బాయ్‌కాట్‌ చేస్తున్నామని కేకే తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై తాము ఏడు రోజులుగా నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోంది. తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని చెబుతున్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుంది. వాతావరణ పరిస్థితుల వల్ల రబీలో రారైస్‌ రాదు.. ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుంది. అందుకే రబీ ధాన్యం బాయిల్డ్‌రైస్‌గా మారుస్తాం. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం’’ అని కేకే ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం నామా నాగేశ్వరరరావు మాట్లాడుతూ  ‘‘బాయిల్డ్‌ రైస్‌ కొంటారో లేదో తెలపకుండా కేంద్ర ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానాలు చెబుతోంది. తెలంగాణ రైతుల బాధను కేంద్రం పట్టించుకోవట్లేదు. భాజపా నేతలు మోసపూరితంగా మాట్లాడుతున్నారు. యాసంగి పంటను కొనుగోలు చేస్తారో లేదో చెప్పడం లేదు. పార్లమెంట్‌ లోపలా, బయటా నిరసన తెలిపాం. తెలంగాణ రైతులకు న్యాయం జరగట్లేదనే బహిష్కరిస్తున్నాం. ఈ విషయంలో కొంతమంది చిల్లరగా మాట్లాడుతున్నారు’’ అని అన్నారు.

అంతకముందు ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెరాస ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనలు చేపట్టారు. ఎంపీలు ఇవాళ నల్లచొక్కాలు ధరించి పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. ధాన్యం సేకరణకు సమగ్ర జాతీయ విధానం తేవాలని.. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సభ వెలుపలా ప్లకార్డులతో నిరసన తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని