Farm Laws: ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పది : కేటీఆర్‌

మూడు సాగు చట్టాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేశారు

Updated : 19 Nov 2021 12:23 IST


హైదరాబాద్‌ : మూడు సాగు చట్టాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రైతులు సాగిస్తోన్న ఆందోళనకు కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చిందని వారు పేర్కొన్నారు. ఇది రైతుల విజయంగా అభివర్ణించారు.

నేతల శక్తి కంటే..

‘అధికారంలో ఉన్న నేతల శక్తి కంటే.. ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పది. ఎన్నో రోజులుగా చేస్తున్న పోరాటంతో తమ డిమాండ్లను నెరవేర్చుకున్న రైతులు దీన్ని మరోసారి రుజువు చేశారు. జై జవాన్‌.. జై కిసాన్‌’- మంత్రి కేటీఆర్‌

ఇది రైతు విజయం..

‘నల్ల వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల‌ విజయం. ఏడాది కాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, జల ఫిరంగులకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి రైతులు విజయం సాధించిన తీరు అద్భుతం. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారు. ఇది రైతు విజయం.. ఇది  దేశ ప్రజల విజయం. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురందరికీ ఉద్యమాభివందనాలు’- మంత్రి హరీశ్‌ రావు

ఆలస్యంగా స్పందించి కేంద్రం పరువు పోగొట్టుకుంది..

‘నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషకరం. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు. ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు కన్నీటి నివాళులు. రైతుల పోరాటాలకు ముందే కేంద్రం నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. సాగు చట్టాలపై ఆలస్యంగా స్పందించి కేంద్రం పరువు పోగొట్టుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉద్యమం బలపడే అవకాశం ఉందని భాజపా అంచనా వేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో రైతు ఉద్యమానికి కేసీఆర్‌ నేతృత్వం వహిస్తారని భావించారు.- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి

ఓటమి భయంతోనే..

ఉత్తరప్రదేశ్‌లో ఓటమిపాలవుతామన్న భయంతోనే నల్ల చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంది. మొదటి నుంచి రైతు ఉద్యమాలకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా నిలిచింది. కాంగ్రెస్‌ శ్రేణుల అండతో ఉత్తరాది నుంచి దక్షణాది వరకూ రైతులు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌ వరకు నల్లచట్టాలకు వ్యతిరేకంగా  పాదయాత్ర చేసి రైతులకు అండగా నిలిచాం.-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని