TS News: మతపరమైన హింసను భాజపా ఎక్కడా రెచ్చగొట్టలేదు: కిషన్‌రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని.. అది ఆయనకు తగదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..

Published : 20 Dec 2021 01:06 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని.. అది ఆయనకు తగదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ వినాలంటేనే ప్రజలు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బాధ్యత గల సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మతపరమైన హింసను భాజపా ఎక్కడా రెచ్చగొట్టలేదని చెప్పారు. తెరాస నేతల ప్రచారం రైతులను తప్పుదారి పట్టించేలా ఉందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాల్సి మంత్రులు దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు.

బంగాల్‌ ఫార్ములా ఇక్కడ అమలు చేయాలనుకుంటున్నారు: ఈటల
భాజపా కార్యకర్తలపై దాడి చేయాలని సీఎం కేసీఆర్‌ అనడం దారుణమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగాల్‌ ఫార్ములా ఇక్కడ అమలు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం విషయంలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైసు మిల్లులపై దృష్టి పెట్టకుండా కేంద్రంపై నెపం వేస్తున్నారని విమర్శించారు. ‘సీఎం.. ఒకసారి పత్తి అన్నారు, మరోసారి సన్నవడ్లు అన్నారు. ఒకసారి దొడ్డు వడ్లు అన్నారు, ఇప్పుడేమో వరే వద్దంటున్నారు. కేంద్రం ఇస్తేనే రాష్ట్రంలో అన్ని పథకాలు అమలు చేస్తున్నారా?’  అని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని