Kishan Reddy: కేసీఆర్‌ రాచరిక పాలన కోరుకుంటున్నారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హుజూరాబాద్‌ ప్రజలు ఇచ్చిన తీర్పు, ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు నుంచి సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం, మేధావులు

Updated : 15 Feb 2022 13:28 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాతి రోజు నుంచి సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం, మేధావులు అర్థం చేసుకోవాలని కేంద్రమంత్రి, భాజపా సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు బానిసలుగా ఉంటూ తనకు జీహుజూర్‌ అనాలని కేసీఆర్‌ భావిస్తున్నారని.. ఎవరు ఎదిరించినా, వ్యతిరేకించినా సహించలేకపోతున్నారని ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్రకార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. 

‘‘తనను ప్రశ్నించే వారు ఉండొద్దని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్న భాష దిగజారుడుతనంగా ఉంది. ప్రధాని మోదీ, భాజపాపై అవాస్తవాలతో విషం కక్కుతున్నారు. బెదిరింపులు, రెచ్చగొట్టే విధానాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్రానికి, భాజపాకు ఎవరూ శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే. దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీసేలా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. అమరుల ఆత్మలు ఘోషించేలా.. భారత సైనికుల స్థైర్యం దెబ్బతినేలా సీఎం మాట్లాడారు. భారత జవాన్ల దాడిలో పాక్‌ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. తమ స్థావరాల ధ్వంసాన్ని పాక్‌ ఉగ్రవాదులూ అంగీకరించారు. తండ్రి తర్వాత కుమారుడు పాలించేలా నిజాం తరహాలో రాచరిక పాలన మళ్లీ రావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్ల పాలనపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధం. సీఎం కేసీఆర్‌ సవాల్‌ను కేంద్ర ప్రభుత్వం తరఫున స్వీకరిస్తున్నా. సీనియర్‌ పాత్రికేయుల సమక్షంలో గన్‌పార్కు వద్దకు రావాలి’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు