Karnataka: తదుపరి సీఎం ఎంపిక.. కర్ణాటకకు కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌

కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రి ఎంపికపై వేగంగా కసరత్తు జరుగుతోంది. నేడు భాజపా ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశం

Updated : 27 Jul 2021 14:18 IST

బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రి ఎంపికపై వేగంగా కసరత్తు జరుగుతోంది. నేడు భాజపా ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రాత్రి 7 గంటలకు బెంగళూరులోని క్యాపిటల్‌ హోటల్‌లో జరిగే ఈ భేటీలో నూతన సీఎం ఎంపికపై చర్చ జరగనుంది. మరోవైపు ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు జి. కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌లను కేంద్ర పరిశీలకులుగా పార్టీ నిర్ణయించింది. వీరిద్దరూ నేడు బెంగళూరు వెళ్లి పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నారు. శాసనసభాపక్ష సమావేశం అనంతరం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా.. కొత్త సీఎం రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్‌ జోషి, బి.ఎల్‌.సంతోశ్‌, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, బసవరాజ బొమ్మై, సీటీ రవి, సదానంద గౌడ, జగదీశ్‌ శెట్టర్‌ వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో యడియూరప్ప వంటి శక్తిమంతమైన నేత స్థానాన్ని భర్తీ చేయాలంటే అంత సులువు కాదని పార్టీ పెద్దలకు తెలియంది కాదు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం, సామాజిక బలం, నాయకత్వ లక్షణం, ఉత్తర ప్రాంతవాసం.. వంటి సకల గుణాలున్న నేతను గుర్తించేందుకు దిల్లీలో ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు మొదలైంది. మరోవైపు 2023లో అసెంబ్లీ ఎన్నిలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితులు కర్ణాటక పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని