Uddhav Thackeray: హీరోలు కావాలనుకుంటున్నారు.. మీది స్వాతంత్ర్యోద్యమం కాదు

తరుముకొస్తున్న కరోనా మూడో వేవ్‌ ముప్పును నిర్లక్ష్యం చేస్తూ.. ఆలయాలను తెరవాలని, ఉత్సవాలను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్న ప్రతిపక్షాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కౌంటర్‌ ఇచ్చారు.....

Published : 01 Sep 2021 01:18 IST

ముంబయి:  కరోనా మూడో వేవ్‌ ముప్పును నిర్లక్ష్యం చేస్తూ.. ఆలయాలను తెరవాలని, ఉత్సవాలను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్న ప్రతిపక్షాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కౌంటర్‌ ఇచ్చారు. మీరు చేస్తోంది స్వాతంత్ర్య ఉద్యమం కాదని.. ఉద్యమం చేయాలనుకుంటే కరోనాకు వ్యతిరేకంగా చేయాలని హితవు పలికారు. మూడో దశ ముప్పును దృష్టిలో ఉంచుకొని ఉద్ధవ్‌ ప్రభుత్వం ఆలయాలను మూసివేసింది. మహారాష్ట్రలో ఘనంగా జరుపుకొనే దహీ హండీ, వినాయక చవితి వేడుకలపైనా నిషేధం విధించింది. అయితే భాజపాతోపాటు రాజ్‌ ఠాక్రే అధ్యక్షత వహిస్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) పార్టీలు ఆలయాలను తెరవాలని, పండగలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. శివసేన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్‌ స్పందించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఠాణేలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ‘దహీ హండీలు నిర్వహించి హీరోలవ్వాలని కొందరు భావిస్తున్నారు. మీరు చేసేది స్వాతంత్ర్యోద్యమం కాదు.. మీరు పోరాడాలనుకుంటే కరోనాకు వ్యతిరేకంగా పోరాడండి’ అని పేర్కొన్నారు. మమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా పేర్కొంటున్నారని, మేము ఏ మతానికి కూడా వ్యతిరేకులం కాదని ఆయన అన్నారు. ‘మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. కరోనాకు వ్యతిరేకం. మీరు కరోనాపై పోరాడితే మంచిది. ఆక్సిజన్‌ జనరేటర్ల సంఖ్యను పెంచుకోండి. కానీ మీరు ఆ పని చేయరు. ఆ ఉద్దేశం కూడా మీకు ఉండదు. వీధుల్లోకి వచ్చి గందరగోళాన్ని సృష్టించాలనుకుంటారు అంతే’ అని సీఎం ఘాటుగా స్పందించారు. పండగల సమయంలో ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వమే సూచించిందని ఆయన గుర్తుచేశారు.

దేవాలయాలను తెరవాలంటూ, దహీ హండీ ఉత్సవాలకు అనుమతివ్వాలంటూ ముంబయిలోని పలు వీధుల్లో సోమవారం భాజపా నేతలు ర్యాలీలు నిర్వహించారు. ఎంఎన్‌ఎస్‌ నేతలు పలు ప్రాంతాల్లో దహీ హండీ నిర్వహించారు. ఈ వేడుకను నిర్వహించిన ఎంఎన్‌ఎస్‌ నేత బాల నంద్‌గావోంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని