
AP News: బద్వేలులో భాజపాను తెదేపా వెనకుండి నడిపించింది: శ్రీకాంత్‌రెడ్డి
అమరావతి: బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా సాధించిన ఘన విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలు తీరుకు ఈ విజయం నిదర్శనమన్నారు. ఇది బడుగు బలహీన వర్గాలు, సామాన్యుడి విజయమని చెప్పారు. పోటీ చేయడంలేదని చెప్పిన తెదేపా వెనుక ఉండి భాజపాను నడిపించిందని ఆరోపించారు. ఇప్పటికైనా విభజన చట్టంలోని ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. అఖిల పక్ష సమావేశం పెడతామని వైకాపా మొదట్నుంచీ చెబుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకొస్తూనే ఉందని చెప్పారు. ప్రజల తీర్పును అగౌరవ పరిచడాన్ని విపక్షాలు మానుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి దాసరి సుధ 90వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.