Yogi calls Akhilesh: డింపుల్‌కు కరోనా.. అఖిలేష్‌కు యోగి ఫోన్‌..!

ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కిన వేళ..  అఖిలేష్‌ యాదవ్‌కు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Published : 24 Dec 2021 01:20 IST

ఎన్నికళ వేళ.. ఓవైపు విమర్శ, మరోవైపు పరామర్శ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఇప్పటికే ముమ్మరం చేశాయి. ఇదే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేష్‌పై ఓవైపు ప్రధాని మోదీ, సీఎం యోగీ ఆదిత్యనాథ్‌లు విరుచుకు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా యూపీలో ఎర్రటోపీ వాలాల కారణంగానే అభివృద్ధి కుంటుపడిందని.. వారి హయాంలోనే రాష్ట్రంలో రౌడీయిజం రాజ్యమేలిందని ఆరోపిస్తున్నారు. వీటికి అఖిలేష్‌ కూడా దీటుగా బదులిస్తూనే ఉన్నారు. ఇలా యూపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన వేళ.. తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అఖిలేష్‌ భార్య, మాజీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌, వారి కుమార్తెకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అఖిలేష్‌ యాదవ్‌కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. అఖిలేష్‌ కుటుంబం తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అయితే, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో మాత్రం అఖిలేష్‌కు నెగటివ్‌గా వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అంతకుముందు తమకు కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు డింపుల్‌ యాదవ్‌ స్వయంగా పేర్కొన్నారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని, లక్షణాలు మాత్రం ఏమీ లేవని చెప్పారు. ఇప్పటికే తాను రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు డింపుల్‌ యాదవ్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకోవాలని తన తండ్రి ములాయం సింగ్‌ నిర్ణయించుకున్న తర్వాతే తాను వ్యాక్సిన్‌ తీసుకుంటానని అఖిలేష్‌ ఇటీవలే వెల్లడించారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ ధ్రువపత్రంపై మోదీ ఫొటో తొలగించిన తర్వాతే తాను వ్యాక్సిన్‌ తీసుకుంటానని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పేర్కొన్నారు. దీంతో అఖిలేష్‌ యాదవ్‌ కరోనా టీకా తీసుకున్నారా? లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

ప్రచారానికి దూరం..

యూపీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ తరపున అఖిలేష్‌ యాదవ్‌ ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సమయంలో తన భార్య, కుమార్తెకు పాజిటివ్‌ రావడంతో నేడు జరిగే ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా మరో మూడు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉంటానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు కొవిడ్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినట్లు ఉన్న రిపోర్టును ట్విటర్‌లో షేర్‌ చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని