
AP News: సొంత పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు
పాయకరావుపేట గ్రామీణం: విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు మరోసారి అసమ్మతి సెగ తగిలింది. పార్టీ జెండా మోసిన వారిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో ఆ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గీయులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి దిగారు. ఈ సందర్భంగా అసమ్మతి వర్గానికి చెందిన యజ్జల సత్యనారాయణ వర్గీయులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుపై బీఫారం కేటాయించిన అభ్యర్థులను కాదని ఇతర పార్టీల అభ్యర్థులతో చేతులు కలిపి సొంత పార్టీకి చెందిన సర్పంచి, ఎంపీటీసీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు. తమపై కక్షగట్టి వాలంటీర్లను తొలగించారని ఆరోపించారు. పార్టీకి చెడ్డపేరు తెస్తున్న ఎమ్మెల్యేని తమ గ్రామంలోకి రానివ్వబోమని ఆందోళనకు దిగారు. దీంతో చాలా సేపు ఎమ్మెల్యే తన వాహనంలోనే కూర్చుండిపోయారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఎంతో శ్రమించారు. ఎట్టకేలకు భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎమ్మెల్యే గ్రామానికి చేరుకొని సీఎస్ఆర్ పథకంలో భాగంగా నిర్మించిన తాగునీటి పథకాన్ని, రహదారిని ప్రారంభించారు.
‘పదేళ్లుగా జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేదు. అధికారుల వద్ద గౌరవం లేదు. వాలంటీర్లు మాట వినడం లేదు. అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. మూడు మండలాలకు చెందిన నాయకులు టికెట్ ఇవ్వొద్దంటే.. ఎస్.రాయవరం మండలం నుంచి మనమంతా అండగా నిలిచి గొల్ల బాబూరావును ఎమ్మెల్యేగా గెలిపించాం. ఆయన మనకిస్తున్న విలువ ఏదీ?’ అంటూ పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఇటీవల ఎమ్మెల్యే బాబూరావుకు వ్యతిరేకంగా సమావేశమై ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరో వర్గం ఆందోళనకు దిగడంతో వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.