Ap News: సొంత పార్టీ నేతనే విమర్శిస్తావా.. ఎవరు చెబితే చేశావంటూ వైకాపా నేతపై దాడి

ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై గుంటూరులో అదే పార్టీకి చెందిన కొందరు పార్టీ శ్రేణులు దాడి చేశారు. ఇటీవల వైకాపాలో కొందరి తీరుపై సుబ్బారావు

Published : 21 Dec 2021 01:25 IST

ప్రకాశం: ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై గుంటూరులో అదే పార్టీకి చెందిన కొందరు పార్టీ శ్రేణులు దాడి చేశారు. ఇటీవల వైకాపాలో కొందరి తీరుపై సుబ్బారావు గుప్తా విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఆయనపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతనే విమర్శించాడని వైకాపా శ్రేణులు దాడికి దిగారు. వైకాపా నేతల వైఖరిని విమర్శించిన సుబ్బారావు గుప్తా ఇంటిపై మొన్న రాత్రి వైకాపా శ్రేణులు దాడి చేశారు. దాడి అనంతరం తప్పించుకొని వెళ్లిన సుబ్బారావు.. గంటూరులోని లాడ్జిలో దాక్కున్నాడు. అతని సమాచారం తెలుసుకున్న వైకాపా కార్యకర్త సుభాని, మరికొందరు పార్టీ శ్రేణులు.. మంత్రి బాలినేనినే విమర్శిస్తావా అంటూ లాడ్జికి వెళ్లి సుబ్బారావును కొట్టాడు. ఎవరు చెబితే విమర్శలు చేశావని ప్రశ్నిస్తూనే కొట్టారు. అంతటితో ఆకుండా మోకాళ్లపై కూర్చొబెట్టి, క్షమాపణ చెప్పించి వీడియో తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

దాడులు చేయడం మా సంస్కృతి కాదు: బాలినేని

వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనపై మంత్రి బాలినేని స్పందిస్తూ.. ‘‘గుప్తాపై దాడి జరుగుతోందని తెలిసి మా వాళ్లను ఆగమని చెప్పాను. నా గురించి ఒంగోలు ప్రజలకు తెలుసు. దాడులు చేయడం మా సంస్కృతి కాదు. మతిస్థిమితం లేకే గుప్తా సభలో అలా మాట్లాడారు. సుబ్బారావు గుప్తాను కొడుతున్నారని తెలిసి వెంటనే ఫోన్‌ చేసి ఆపా. ఒంగోలులో తెదేపా నేతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వివిధ పార్టీల జెండాలను గుప్తా అమ్ముతంటారు. గుప్తాకు నాతో ఎక్కువ పరిచయం ఉన్న మాట వాస్తవమే’’ అని మంత్రి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని