Andhra News: ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు... తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండవల్లి కరకట్ట సమీపంలో నిర్మించిన ప్రజావేదికను

Updated : 25 Jun 2022 18:28 IST

అమరావతి: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండవల్లి కరకట్ట సమీపంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి నేటికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా తెదేపా శ్రేణులు నిరసన తెలుపుతారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ప్రజావేదిక లో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సీఎం జగన్‌... అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అదే రోజు రాత్రి కూల్చివేత పనులు చేపట్టారు. అప్పటి నుంచి ఏటా ఇదే రోజు తెదేపా శ్రేణులు ప్రజావేదిక కూల్చివేసిన ప్రాంతంలోని శిథిలాల వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ ఏడాది కూడా తెదేపా శ్రేణులు నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతుండటంతో పోలీసులు అప్రమత్తమై చంద్రబాబు ఇంటి వద్ద  భారీగా మోహరించారు.

చంద్రబాబు నివాసానికి వెళ్లే మూడు మార్గాలను బారికేడ్లు, ముళ్లకంచెలతో మూసివేశారు. కొండవీటి వాగువైపు, ఉండవల్లి గుహల వైపు, సచివాలయం నుంచి విజయవాడవైపు వచ్చే మూడు దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ముళ్లకంచెల, బారికేడ్లతో దిగ్బంధించారు. సామాన్య ప్రజలు  సైతం ఇటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. తమ పొలాల వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రోడ్డుపైనే బైఠాయించిన తెదేపా నేతలు

ప్రజావేదిక శిథిలాల వద్దకు వెళ్లేందుకు తెదేపా శ్రేణులు ప్రయత్నించడంతో ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా నేతలు   నక్కా ఆనందబాబు, సత్యనారాయణరాజు, పట్టాభిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. 
ప్రజా వేదిక కూల్చి మూడేళ్లైన నేపథ్యంలో శిథిలాల వద్ద నిరసన తెలిపేందుకు తెదేపా నేతలు ప్రయత్నించారు. ముందే ఈ విషయాన్ని గ్రహించిన పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని