Congress: నేను ఎవరికీ అనుకూలం కాదు.. ఆ ఆలోచన పక్కన పెట్టండి: ఠాక్రే

‘ఎముకలు కొరికే చలిలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్ర చేశారు. యాత్ర లక్ష్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంద’ని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

Published : 22 Jan 2023 01:11 IST

హైదరాబాద్‌: ‘‘నేను ఎవరికీ అనుకూలం కాదు.. వ్యతిరేకం కాదు. అలాంటి ఆలోచన ఉంటే పక్కనపెట్టండి. అధిష్ఠానం చెప్పింది చేయడమే నా విధి’’ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారత్‌ జోడో యాత్ర మాదిరిగానే  తెలంగాణలో రెండు నెలల పాటు చేపట్టనున్న హాథ్‌సే హాథ్‌ జోడో కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకువెళ్లాలని సూచించారు.

‘‘ఎముకలు కొరికే చలిలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్ర చేశారు. యాత్ర లక్ష్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది. నేతలంతా ఐక్యంగా హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర చేయండి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 50 నియోజకవర్గాలకు తగ్గకుండా యాత్ర చేస్తారు. మిగిలిన సీనియర్లు కూడా 20.. 30 నియోజకవర్గాల్లో యాత్ర చేయాలి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ యాత్రను విజయవంతం చేయాలి. అంతా ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం, అధికారంలోకి రావడం ఖాయం. సమస్యలు ఉంటే చెప్పండి. నాకు ఫోన్‌ చేయండి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దు’’ అని ఠాక్రే పార్టీ నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 6 నుంచి పాదయాత్ర: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర  కొనసాగుతుందని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.  ప్రియాంక లేదా సోనియాగాంధీ ఒక రోజు యాత్రలో పాల్గొనేలా సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. ఈనెల 26న భద్రాచలం నుంచి లాంఛనంగా యాత్రను ప్రారంభించనున్నట్టు వివరించారు. ఠాక్రే సమావేశానికి 3 సార్లు రానివారి నుంచి వివరణ తీసుకుంటామని, కీలక సమావేశానికి హాజరుకాని వారిని పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డిపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. నాగర్‌ కర్నూల్‌లో  దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని