Shashi Tharoor: నా బలమెంటో.. ఆ రోజు చూస్తారు..!

శతాధిక పార్టీ కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అధ్యక్ష బరిలో కీలకంగా ఉన్నారు.

Published : 27 Sep 2022 01:42 IST

పాలక్కాడ్‌:  కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అధ్యక్ష బరిలో కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలో పాల్గొనడంపై దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తల నుంచి తనకు మద్దతు ఉందని వెల్లడించారు. నామినేషన్ రోజున తన బలమేంటో తెలుస్తుందన్నారు. 

‘నేను నామినేషన్ వేసే సమయంలో.. నా బలమేంటో మీరు చూస్తారు. మెజార్టీ రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభిస్తేనే.. నేను పోటీలో ఉంటాను. అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉండమని నన్ను ఎంతోమంది అభ్యర్థించారు. ప్రస్తుతం నేను నామినేషన్ పత్రాన్ని పొందాను. నేతలను కలుస్తూ, వారితో మాట్లాడుతున్నాను. ఈ పోటీ గురించి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో చర్చించాను. దీంతో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు నేరుగా వెల్లడించారు’ అని థరూర్ పేర్కొన్నారు.

అధ్యక్ష పదవి పోటీ గురించి ఇదివరకే థరూర్.. సోనియాను కలిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో దిగేందుకు తాను సిద్ధమైనట్టు సోనియాకు చెప్పగా.. అందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ ఎన్నిక నిమిత్తం ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోబరు 1న నామినేషన్‌ పత్రాలను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఇచ్చారు. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే అక్టోబరు 17న ఓటింగ్‌ నిర్వహించనున్నారు. 19న ఫలితాలను వెల్లడిస్తారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని