Mamata Banerjee: కేంద్రం, దీదీ మధ్య ‘తుపాను’ చిచ్చు  

యస్‌ తుపాను సమీక్షా సమావేశం..మరోసారి కేంద్రం, దీదీ మధ్య వివాదానికి ఆజ్యం పోసింది.

Updated : 31 May 2021 12:21 IST

ప్రధాన కార్యదర్శిని రిలీవ్‌ చేయలేమన్న మమత

కేంద్రం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని మోదీకి లేఖ

కోల్‌కతా: యస్‌ తుపాను సమీక్షా సమావేశం..మరోసారి కేంద్రం, దీదీ మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వ కార్యదర్శిని తక్షణమే రిలీవ్ చేయాలంటూ రెండు రోజుల క్రితం కేంద్రం ఆదేశించగా..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన శైలిలో ఆ ఆదేశాలను ధిక్కరించారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన్ను రిలీవ్ చేయడం కుదరదని చెప్తూ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష ఉత్తర్వులతో తాను షాక్‌కు గురయ్యాయని, అంతే ఆశ్చర్యపోయానని ఆ లేఖలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

‘కరోనా మహమ్మారి వల్ల పశ్చిమ బెంగాల్ తీవ్రంగా ప్రభావితమైంది. యస్‌ తుపానుతో మరింత బీభత్సం చోటుచేసుకుంది. ఈ క్లిష్ట సమయంలో బెంగాల్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి (ఆలాపన్ బంధోపాధ్యాయ్‌)ని రిలీవ్ చేయలేదు’ అంటూ ఆ లేఖలో వెల్లడించారు. మే 31 నాటికి బంధోపాధ్యాయ్‌కు 60 ఏళ్లు నిండుతాయి. నిజానికి ఈ రోజే పదవీవిమరణ చేయాల్సి ఉండగా.. ఆయన సేవలను మరో మూడు నెలల పాటు పెంచుతూ గత సోమవారం మమత ఆదేశాలు జారీ చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఆయనకున్న అనుభవం దృష్ట్యా సేవలపెంపుపై ఈ నెల 12న మమత ప్రధానికి లేఖ రాశారు. ఆయన పదవీ కాలం పొడిగించేందుకు రాష్ట్రం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించిందని ఈ సందర్భంగా లేఖలో ఆమె గుర్తు చేశారు. దాంతో తాజా ఉత్తర్వులు చట్టాలను ఉల్లంఘించేవిగా, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ‘ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉన్న ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆదేశాల వెనక కలైకుండాలో ప్రధాని మోదీతో జరిగిన సమావేశానికి ఏదైనా సంబంధం ఉందా? అదే కారణం అయితే.. చాలా దురదృష్టకరం. ఈ నిర్ణయం ప్రజా ప్రయోజనాలను బలి పెట్టడం కిందికే వస్తుంది’ అని ఆమె లేఖలో వ్యాఖ్యానించారు.  

యస్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటించి, ఆయా రాష్ట్రాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో బెంగాల్‌లో జరిపిన సమావేశానికి మమతతో కలిసి ప్రధాన కార్యదర్శి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఆ వెంటనే ఆయన దిల్లీలో రిపోర్టు చేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో ఈ ఉత్తర్వుల వెనక సమావేశ ప్రభావం ఉందేమోనన్న చర్చ జరుగుతోంది. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు