The Great Khali: భాజపాలోకి ‘ది గ్రేట్‌ ఖలీ’.. ప్రధానిపై ప్రశంసలు

‘ది గ్రేట్‌ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్‌ దలీప్‌ సింగ్‌ రానా గురువారం భాజపాలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. భాజపా జాతీయ విధానాలకు ఆకర్షితుడినై...

Published : 11 Feb 2022 01:24 IST

దిల్లీ: ‘ది గ్రేట్‌ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్‌ దలీప్‌ సింగ్‌ రానా గురువారం భాజపాలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. భాజపా విధానాలకు ఆకర్షితుడినై ఇందులో చేరినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ‘భాజపాలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ఆయన్ను సరైన స్థానంలో నిలబెడుతోంది. కాబట్టి.. దేశాభివృద్ధి కోసం ఆయన పాలనలో నేనెందుకు భాగం కాకూడదని అనిపించింది’ అని చెప్పుకొచ్చారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు పది రోజుల ముందు ఆయన కమలం గూటికి చేరుకోవడం గమనార్హం.

ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టక ముందు ఖలీ.. పంజాబ్‌ పోలీస్ అధికారిగా పని చేసిన విషయం తెలిసిందే. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతు నిరసనలకూ మద్దతు తెలిపారు. ఆ చట్టాలతో సామాన్యులు సైతం ఇబ్బంది పడతారని.. ఈ నేపథ్యంలో దేశవాసులంతా అన్నదాతలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్‌లో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఖలీని కలిశారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌కే ఆయన మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. కానీ, తాజాగా ఆయన.. కమల దళంలో చేరారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని