Sharad Pawar: అదే జరిగితే.. 2024 ఎన్నికల్లో మార్పు తథ్యం: శరద్‌ పవార్‌

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మార్పును చూస్తారని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఉదహరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 07 Jun 2023 16:33 IST

ఔరంగాబాద్‌: దేశంలో ప్రస్తుతం భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) అన్నారు. ఇదే కొనసాగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (General elections) ప్రజలు మార్పును తప్పకుండా చూస్తారని తెలిపారు. ఔరంగాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో భాజపా వ్యతిరేక (anti-BJP) గాలి వీస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలనే చూడండి..! ప్రజలు మార్పును కోరుకున్నారు. భాజపాను దించి కాంగ్రెస్‌ను అధికారమిచ్చారు. ప్రజల మనస్తత్వం ఇలాగే కొనసాగితే.. వచ్చే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (2024 Loksabha Elections) మార్పు తథ్యం. ఇది చెప్పేందుకు ఏ జోతిష్కుడు అవసరం లేదు’’ అని పవార్‌ వ్యాఖ్యానించారు.

ఇక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే అవకాశాలున్నాయని ప్రశ్నించగా పవార్‌ స్పందిస్తూ.. ‘‘అలా జరుగుతుందని అనుకోవడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka election results) ఫలితాలను చూసిన తర్వాత.. కేంద్రంలోని భాజపా (BJP) సర్కారు రిస్క్‌ తీసుకుంటుందని నేను భావించట్లేదు. లోక్‌సభ ఎన్నికలపైనే వారు ప్రధానంగా దృష్టిపెడతారు’’ అని తెలిపారు.

గడ్కరీపై ప్రశంసలు..

ఇక, నరేంద్రమోదీ ప్రభుత్వంలో మీరు అభిమానించే మంత్రి ఎవరని పవార్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)పై ప్రశంసలు కురిపించారు. ‘‘కొందరు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా పనులు చేస్తుంటారు. ఉదాహరణకు నితిన్‌ గడ్కరీ. ఆయన తన పార్టీని దృష్టిలో పెట్టుకుని పనులు చేయరు. ఆయనకు మనం ఏదైనా అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే.. అది ఎంత ముఖ్యమైనది అని మాత్రమే ఆలోచిస్తారు తప్ప.. ఎవరు చెప్పారు అన్నది చూడరు’’ అని గడ్కరీని పవార్‌ (Sharad Pawar) ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని