Karnataka: మే 10నే ఎన్నికలు.. కాంగ్రెస్‌లో చేరికలు

 మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. భాజపా, జేడీఎస్‌ నుంచి పలువురు నేతలు ఆపార్టీలోకి చేరుతున్నారు.

Updated : 30 Mar 2023 17:17 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka Elections) లో రాజకీయ వేడి రాజుకుంటోంది. పోలింగ్‌ తేదీ కూడా ఖరారు కావడంతో విజయంపై ఆయా పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని భాజపా (BJP), ఎలాగైనా  అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ (Congress) ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌లోకి నాయకులు పెద్ద సంఖ్యలో వలస వస్తున్నారు. ఇప్పటికే భాజపా నుంచి ఇద్దరు కీలక నేతలు హస్తం గూటికి చేరగా.. తాజాగా జేడీఎస్‌కు చెందిన ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2018 ఎన్నికల్లో జేడీఎస్‌ తరఫున పోటీ చేసిన దాదాపు 37 మంది నేతలు ఇప్పటికే పార్టీలో చేరగా.. మరికొంత మంది సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం మంత్రిగా పని చేశారు. తన మద్దతుదారులతో కలిసి శ్రీనివాస్‌.. పార్టీలో చేరినట్లు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వెల్లడించారు. ‘‘ చాలా రోజులుగా శ్రీనివాస్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొద్దామని ప్రయత్నించాను. ప్రజల మనిషిగా, వారి కోరిక మేరకు ఇప్పుడు ఆయన పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది. ఆయన పార్టీలో చేరడం వల్ల కేవలం తుమకూరు నియోజకవర్గం మాత్రమే కాకుండా, మైసూరు ప్రాంతమంతటా కాంగ్రెస్‌ బలపడుతుంది. ఇందులో సందేహం లేదు’’ అని శివకుమార్‌ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున బరిలోకి దిగిన 37 మంది ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారని ఆయన చెప్పారు.

సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతోందని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. గతంలో తన తండ్రికి కూడా ఈ పార్టీతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ‘‘నాకు జేడీఎస్‌ను వీడాలని ఉండేది కాదు. కానీ, పరిస్థితులు అలా మారాయి. నేను పార్టీలో ఉన్నప్పటికీ.. తుమకూరు నుంచి పోటీ చేసేందుకు వేరే నాయకుడి పేరును  కుమారస్వామి తెరమీదకు తీసుకొచ్చారు. 2019లో తుమకూరులోక్‌సభ స్థానానికి పోటీ చేసిన దేవెగౌడ పరాజయం పాలవ్వడానికి నేనే కారణమంటూ నన్ను పక్కన పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు నేనెప్పుడూ పాల్పడలేదు.’’ అని శ్రీనివాస్‌ తెలిపారు.

ఇటీవల భాజపాకి చెందిన ఎమ్మెల్సీలు  పుట్టన్న, చించాన్‌సుర్‌ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.  వీరితోపాటు కర్ణాటక హౌసింగ్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు  చిక్‌మగ్‌ళూరుకు చెందిన హళప్ప కూడా కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయ కారణాలతో 2017లో ఆయన కాంగ్రెస్‌ను వీడి.. భాజపాలో చేరారు. తాజా తిరిగి సొంతగూటికి వచ్చేశారు. మాండ్య నియోజకవర్గం నుంచి మరో భాజపా నేత సత్యానంద కూడా ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. మరికొన్ని రోజుల పాటు కాంగ్రస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని