Sivasena: ‘రావణుడు కాలిపోతాడు’.. శిందేను ఉద్దేశించి ఉద్ధవ్‌ వ్యాఖ్య

శివాజీ పార్కులో ఏర్పాటు చేసిన సమావేశం వేదికగా సీఎం శిందేపై ఉద్ధవ్‌ ఠాక్రే విరుచుకుపడ్డారు. ‘‘ రావణుడు కాలిపోతాడు’’అని  శిందేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Published : 06 Oct 2022 01:36 IST

ముంబయి: శివసేనలోని ఉద్ధవ్‌ ఠాక్రే, ముఖ్యమంత్రి శిందే వర్గాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు తారస్థాయికి చేరాయి. వీటికి దసరా ర్యాలీలే వేదికలుగా నిలిచాయి. పార్టీకి కొడుకే వారసుడిగా ఉండాలన్న నిబంధనేమీ లేదంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ను ఉద్దేశిస్తూ శిందే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై శివాజీ పార్కులో ఏర్పాటు చేసిన సమావేశం వేదికగా ఉద్ధవ్‌ స్పందించారు. ‘‘ రావణుడు కాలిపోతాడు’’అని  శిందేను ఉద్దేశిస్తూ అన్నారు. ‘‘ ఇంతమంది ప్రజలు అండగా ఉండగా శివసేనకు ఏమౌతుంది?అసలేం కాదు. పార్టీ తిరుగుబాటు దారులకు ఏమవుతుందన్నదే ప్రశ్న. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మనమంతా ఒక చోట చేరాం. ఇప్పుడు కూడా రావణ దహనం జరుగుతుంది. కానీ, ఈసారి కాలిపోయే రావణుడు వేరే’’ అని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. ఉద్ధవ్‌ ఠాక్రే నివాసానికి సమీపంలోని ఎంఎంఆర్డీయే మైదానంలో శిందే వర్గీయులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ‘‘ కొడుకు అయినంత మాత్రన నా కొడుకు నా వారసుడు కాదు. ఎవరు వారసుడైతే వాడే నా కొడుకు’’ అంటూ రాయ్‌ మాటలను ఉటంకిస్తూ ఉద్దవ్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

శిందేకే నా మద్దతు: ఉద్ధవ్‌ సోదరుడు

శివసేన రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. శిందే వర్గానికే తన మద్దతు ఉంటుందని ఉద్ధవ్‌ సోదరుడు జైదేవ్‌ ఠాక్రే వెల్లడించారు. ఈ మేరకు శిందే వర్గం నిర్వహిస్తున్న దసరా ర్యాలీలో ఆయన స్పష్టం చేశారు. ‘‘ మీరు శిందే వర్గమా?ఉద్ధవ్‌ వర్గమా? అని గత ఐదారు రోజులుగా నన్ను అడుగుతున్నారు. ఠాక్రేలు ఏ వర్గానికీ చెందిన వారు కాదు. పేదలకు మంచి చేసేందుకు శిందే అవలంభిస్తున్న విధానాలు బాగా నచ్చాయి. అందుకే ఆయనకు మద్దతు తెలుపుతున్నా. ఆయన్ని ఒంటరిగా వదిలేయొద్దు. మీరంతా ఆయనకు అండగా నిలవాలి’’ అని జైదేవ్‌ ఠాక్రే తెలిపారు. మళ్లీ ఎన్నికలు జరిగినా కచ్చితంగా శిందే ప్రభుత్వమే వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని