‘త్వరలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌‌’

పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలో రాజీనామా చేయనున్నారని ఆ కేంద్రపాలిత ప్రాంత భాజపా బాధ్యులు నిర్మల్‌ కుమార్‌ సురన తెలిపారు. ఈ నేపథ్యంలో నారాయణస్వామి....

Updated : 19 Feb 2021 15:59 IST

పుదుచ్చేరి సంక్షోభంపై భాజపా ఇన్‌ఛార్జి నిర్మల్‌ కుమార్‌

బెంగళూరు: పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలో రాజీనామా చేయనున్నారని ఆ కేంద్రపాలిత ప్రాంత భాజపా బాధ్యులు నిర్మల్‌ కుమార్‌ సురన తెలిపారు. ఈ నేపథ్యంలో నారాయణస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో తప్పకుండా బలం కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాజీనామా చేసిన నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఇద్దరు భాజపాలో చేరారు. మరోవైపు నారాయణస్వామి ప్రభుత్వం శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌ కుమార్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇప్పటికే రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు కూడా భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని నిర్మల్‌ కుమార్‌ తెలిపారు. దిల్లీలోని అధిష్ఠానంతో దీనిపై చర్చిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాసం కోల్పోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. అయితే, కొత్తగా రాజీనామా చేయనున్న వారెవరో చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు. మరి వారిని భాజపాలోకి ఆహ్వానిస్తారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘భాజపా సిద్ధాంతాలతో ఏకీభవించే వారెవరైనా పార్టీలో చేరొచ్చు’’ అని అన్నారు.

మరో పుదుచ్చేరిలో నారాయణస్వామి ప్రభుత్వం శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ఆదేశించారు. ఈ నెల 22న సాయంత్రం 5 గంటల్లోపు పుదుచ్చేరి శాసనసభలో విశ్వాసపరీక్ష జరగాలని పేర్కొన్నారు. ఓటింగ్‌ ప్రక్రియను పూర్తిగా వీడియో తీయాలని ఆదేశించారు. బలపరీక్షకు ఎల్జీ ఆదేశించిన నేపథ్యంలో మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలతో సీఎం నారాయణస్వామి గురువారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. అధికార బలంతో ప్రతి రాష్ట్రంలోనూ అధికార మార్పిడికి పాల్పడటం భాజపాకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని కూల్చే పనులను భాజపా ప్రారంభించిందని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని