Gujarat elections: గుజరాత్‌లో త్రిముఖ పోరు.. ఈసారి డబుల్‌ ఇంజినా? కొత్త ఇంజినా?

Gujarat elections: గత కొన్నేళ్లుగా గుజరాత్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్యే పోరు కొనసాగుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రవేశంతో త్రిముఖ పోరు నెలకొంది.

Updated : 03 Nov 2022 15:15 IST

అహ్మదాబాద్‌: మోదీ, అమిత్‌షాల సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎన్నికల నగారా మోగింది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ భాజపా అధికారంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్‌ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. పంజాబ్‌లో విజయంతో ఊపు మీద ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. దీంతో గుజరాత్‌లో త్రిముఖ పోరు నెలకొంది.

182 అసెంబ్లీ స్థానాలు కలిగిన గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్‌ వెలువరించింది. ప్రస్తుతం 111 ఎమ్మెల్యేలతో భాజపా అధికారంలో ఉండగా.. 62 మంది ఎమ్మెల్యేలు కలిగిన కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. బీటీపీకి ఇద్దరు, ఎన్సీపీకి ఒకరు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉండగా.. ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటే డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

‘డబుల్‌ ఇంజిన్‌’ ప్రచారం

గత ఆరు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీకి మరోసారి అధికారాన్ని నిలుపుకోవడం కీలకంగా మారింది. 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముంగిట ఈ ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం. అదే సమయంలో మోదీ, అమిత్‌షాల సొంత రాష్ట్రం కూడా కావడం ఇందుకు నేపథ్యం. దీంతో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ పలుమార్లు గుజరాత్‌లో పర్యటించారు. షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో మరిన్ని సభల్లో పాల్గోనున్నారు. ఇటీవలే రాష్ట్రంలోని వివిధ చోట్ల రూ.15,670 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధే నినాదంగా ఆ పార్టీ ప్రచారంలో ముందుకు సాగుతోంది. ‘నరేంద్ర -భూపేంద్ర’ (డబుల్‌ ఇంజిన్‌) కలిస్తే మున్ముందూ  రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. అమిత్‌షా, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారం షురూ చేశారు. అయితే, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మోర్బీ దుర్ఘటన జరగడం అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామం. దీన్ని ఆయుధంగా మలుచుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి.

మరో రాష్ట్రం ఒడిసి పట్టాలని..

కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. పంజాబ్‌ రూపంలో ఆ పార్టీకి లభించిన బూస్ట్‌తో గుజరాత్‌లోనూ పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ గుజరాత్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ఉచిత విద్య, వైద్యం వంటి సంక్షేమ హామీలతో ఆ పార్టీ ప్రచారంలో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ పోటీ చేయాలని భావిస్తోంది. రాష్ట్రానికి పాతబడిపోయిన డబుల్‌ ఇంజిన్‌ సరిపోదని, ఆప్‌ వంటి కొత్త ఇంజిన్‌ కావాలంటూ ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది.

జోరు చూపని కాంగ్రెస్‌

గత ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఎన్నికల్లో భాజపాకు గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్‌.. ఈ సారి ప్రచారంలో వెనకబడిపోయింది. రాహుల్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’లో తలమునకలవ్వగా.. జాతీయ స్థాయి నేతలెవరూ ఆ రాష్ట్రంలో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆ పార్టీ గుజరాత్‌ ఇన్‌ఛార్జి రఘు శర్మ ప్రచార బాధ్యతలను చేపట్టి ముందుకు సాగుతున్నారు. అయితే, అభ్యర్థుల ప్రకటన జరిగాక ప్రచారం జోరందుకుంటుందని పార్టీ నేత మనీశ్‌ దోషి పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్‌ ప్రభుత్వ విజయాలను ప్రధానంగా ప్రచారానికి ఆ పార్టీ వినియోగించుకుంటోంది. అలాగే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను తెరపైకి తెస్తూ భాజపాను ఇరుకునపెట్టాలని చూస్తోంది. మోర్బీ దుర్ఘటన విషయంలో భాజపాపై విమర్శల దాడిని పెంచింది. ఆప్‌ను భాజపా ‘బి’ టీమ్‌ అంటూ విమర్శిస్తోంది.

ఈ మూడు ప్రధాన పార్టీలు కాకుండా శంకర్‌ సిన్హ్‌ వాఘేలా, కేశుభాయ్‌ పటేల్‌, చిమన్‌ భాయ్‌ పటేల్‌ వంటి వారు స్థాపించిన స్థానిక పార్టీలు సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే, ఆ పార్టీల ప్రభావం నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంది. మైనారిటీలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని ఎంఐఎం సైతం చూస్తోంది.

గుజరాత్‌ అసెంబ్లీ చరిత్ర..

గుజరాత్‌ ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి మూడు ఎన్నికల్లో (1962, 1967, 1972) కాంగ్రెస్సే విజయం సాధించింది. ఎమర్జెన్సీ కారణంగా మధ్యలో అధికారానికి దూరమైనా.. 1980, 85 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించింది. 1990లో తొలిసారి జనతాదళ్‌తో కలిసి భాజపా అధికారంలోకి వచ్చింది. ఆ మరుసటి (1995) ఎన్నికల నుంచి వరుసగా భాజపానే అధికారంలో కొనసాగుతోంది. మధ్యలో 1996-98 మధ్య శంకర్‌ సిన్హ్‌ వాఘేలా తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ రెండేళ్లు మాత్రం భాజపా అధికారానికి దూరమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని