Updated : 25 Jun 2022 20:30 IST

Maharashtra crisis: తేలని ‘మహా’ ఉత్కంఠ.. టాప్‌-10 అప్‌డేట్స్‌

ముంబయి: మహారాష్ట్రలోని (Maharashtra) సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామి శివసేనలో (shiv sena) అంతర్గత సంక్షోభం తారస్థాయిలో కొనసాగుతోంది. దీంతో వరుసగా ఐదో రోజూ మరాఠా రాజకీయం క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. అటు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన, ఏక్‌నాథ్‌ శిందే రెబల్‌ ఎమ్మెల్యేల బృందాలు వరుస భేటీలు నిర్వహిస్తున్నా ప్రతిష్టంభన వీడటంలేదు. మరోవైపు, శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆరు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఏక్‌నాథ్‌ శిందే నిన్న రాత్రి గుజరాత్‌లోని వడోదరలో దేవేంద్ర ఫడణవీస్‌తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు జరిగిన కీలక పరిణామాలకు సంబంధించిన 10 అప్‌డేట్స్‌ ఇవే.. 

  1. శివసేన నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు శివసేన జాతీయ కార్యవర్గం ముంబయిలో భేటీ అయింది. ఈ సమావేశంలో ఆరు తీర్మానాలు ఆమోదించింది. పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యలు తీసుకొనేందుకు శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్‌ఠాక్రేకు అధికారం అప్పగించింది. 
  2. శివసేన పేరు, ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే పేరును ఇతర రాజకీయ సంస్థలు ఉపయోగించరాదని తీర్మానించింది. శివసేన బాల్‌ఠాక్రేకు చెందినదని.. హిందుత్వ, మహారాష్ట్రను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కట్టుబడి ఉందని పేర్కొంది. ఈ మార్గం నుంచి శివసేన ఎప్పటికీ వైదొలగదని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పష్టంచేశారు. 
  3. డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ 33మంది రెబల్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసు తిరస్కరణకు గురైంది. తనకు వ్యతిరేకంగా అసమ్మతి ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసును డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారు. 33మంది రెబల్‌ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినప్పటికీ గుర్తు తెలియని ఈ-మెయిల్‌ నుంచి పంపారని పేర్కొంటూ దాన్ని తిరస్కరించినట్టు సమాచారం.
  4. మరోవైపు, ఏక్‌నాథ్‌ శిందే నాయకత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలూ అస్సాంలోని గువాహటిలోని హోటల్‌లో భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు. అయితే, తాము ఇప్పటికీ శివసేనలోనే ఉన్నామని రెబల్‌ ఎమ్మెల్యే దీపక్‌ కేసర్‌కర్‌ వ్యాఖ్యానించారు  ఉద్ధవ్‌ఠాక్రేకు తాము వ్యతిరేకం కాదన్నారు. తమకు ఉన్న 2/3వ వంతు మెజార్టీతో కొత్త నేతను ఎన్నుకున్నట్టు తెలిపారు. శివసేన వద్ద 17కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేరని.. తమ వర్గానికి శివసేన బాలాసాహెబ్‌ అని పేరు పెట్టుకున్నట్టు ఆయన ఓ వార్తా సంస్థకు తెలిపారు. 
  5. మహారాష్ట్రలోని తమ కుటుంబాలు, కార్యాలయాలకు భద్రతను ఉపసంహరించుకోవడంపై తిరుగుబాటు మంత్రి ఏక్‌నాథ్‌ శిందే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. ప్రోటోకాల్‌ ప్రకారం భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు. తమ కుటుంబాలకు ఏదైనా జరిగితే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే  బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
  6. నిజం, అబద్ధం మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో గెలుపు తమదేనని మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మరచిపోలేమన్నారు. శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చివరకు నిజమే విజయం సాధిస్తుందన్నారు. 
  7. మరోవైపు, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా జిల్లాల్లో శివసేన శ్రేణులు ఆందోళనలు కొనసాగుతున్నాయి.  తిరుగుబాటు ఎమ్మెల్యేల హోర్డింగ్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారు. ఎమ్మెల్యే తానాజీ సావంత్‌, శిందే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ శిందే కార్యాలయాలను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. 
  8. శివసేన జాతీయ కార్యవర్గ భేటీకి ముందు ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ మీడియా వద్ద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు శివసైనికులు ఓర్పుతో ఉన్నారని.. సమయం గడుస్తున్నకొద్దీ వారిలో సహనం నశిస్తోందన్నారు. ఇంకా వారు బయటకు రాలేదని, ఒకవేళ వస్తే..  వీధుల్లో అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. 
  9. ఏక్‌నాథ్‌ శిందే నాయకత్వంలో రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌ బిల్లును ఎవరు చెల్లిస్తున్నారని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామి ఎన్సీపీ ప్రశ్నించింది. ఎక్కడి నుంచి నల్లధనం వస్తుందో తేల్చాలని ఐటీ, ఈడీలను కోరింది. 
  10. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. శిందే కంచుకోటగా ఉన్న ఠానేలో 144 సెక్షన్‌ విధించారు. ఏక్‌నాథ్‌ శిందే నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, ముంబయిలో హై అలర్ట్‌ ప్రకటించిన హోంశాఖ.. అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.
Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని