Shiv Sena: తిరుగుబాటు నుంచి తీర్పు వరకు.. ‘మహా సంక్షోభం’ సాగిందిలా..!

శివసేనలో గతేడాది చోటుచేసుకున్న ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభానికి కారణమయ్యాయి. వీటిపై దాఖలపై పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.  

Updated : 11 May 2023 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శివసేనలో (Shiv Sena) ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటు కారణంగా గతేడాది మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. చివరకు మహావికాస్‌ అఘాడీ (MVA) ప్రభుత్వం కూలిపోవడం.. శిందే (Eknath Shinde) నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయాయి. అయితే, ఆ సమయంలో గవర్నర్‌ వ్యవహరించిన తీరు, తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వంటి అంశాలపై అటు ఉద్ధవ్‌ ఠాక్రే, శిందే వర్గాలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. శిందే వర్గానికి చెందిన భరత్‌ గోగావలేను శివసేన విప్‌గా స్పీకర్‌ నియమించడం అక్రమమని పేర్కొన్న సుప్రీం కోర్టు.. ముఖ్యమంత్రిగా శిందేను ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తీరును తప్పుపట్టింది. ఈ క్రమంలో గతేడాది నుంచి ఇప్పటివరకు ‘మహా’ రాజకీయాల్లో నెలకొన్న కీలక పరిణామాలను ఓసారి గుర్తుచేసుకుంటే..

జూన్‌ 20, 2022: మహారాష్ట్రలో జూన్‌ 20న శాసనమండలి ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటింగ్‌ జరిగిన వెంటనే శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే కనిపించకుండా పోయారు. ఆయనతోపాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్నట్లు తేలింది.

జూన్‌ 21: మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని అనుమానించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే.. శివసేన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అనంతరం అసెంబ్లీలో శివసేన పార్టీ నేత బాధ్యతల నుంచి శిందేను తొలగించారు.

జూన్‌ 22: అదే సమయంలో శిందే నేతృత్వంలోని 40 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు సూరత్‌ నుంచి అస్సాంలోని గువాహటీకి మకాం మార్చారు. గుజరాత్‌, అస్సాంలు.. రెండూ భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలే.

జూన్‌ 23: శివసేన అసెంబ్లీ వ్యవహారాల పార్టీ నేతగా శిందేను రెబల్‌ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అదే రోజు.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీచేశారు. అదేరోజు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే అధికార నివాసం వర్షా నుంచి మాతోశ్రీకి మకాం మార్చారు.

జూన్‌ 26: డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ శిందేవర్గం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. 27న విచారించిన సుప్రీంకోర్టు.. అనర్హత అంశాన్ని నిలిపివేయడంతో ఎమ్మెల్యేలకు ఊరట కలిగినట్లు అయ్యింది.

జూన్‌ 29: ఎంవీఏ ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోవాలన్న మహారాష్ట్ర గవర్నర్‌ ఆదేశాలను నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో.. తొమ్మిది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ అవిశ్వాసాన్ని ఎదుర్కోకుండానే ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేశారు.

జూన్‌ 30: ఠాక్రే రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే.. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

జూన్‌ 3-4: అసెంబ్లీ ప్రత్యేకంగా రెండు రోజుల పాటు సమావేశమయ్యింది. స్పీకర్‌గా భాజపా ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ ఎన్నుకున్నారు. జులై 4న నిర్వహించిన విశ్వాసపరీక్షలో శిందేకు మద్దతుగా 164ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి.

ఆగస్టు 23: పార్టీ ఫిరాయింపులు, విలీనం, అనర్హత అంశాలపై శివసేనతోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే లేవనెత్తిన అనేక ప్రశ్నలకు సంబంధించిన దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది.

అక్టోబర్‌ 8: అంధేరీ ఈస్ట్‌ అసెంబ్లీ ఎన్నికకు ముందు శివసేన పార్టీ ఎన్నికల గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా ఆ రెండు వర్గాలకు వేర్వేరు గుర్తులను కేటాయించింది.

ఫిబ్రవరి 17, 2023: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) వర్గమే అసలైన శివసేన పార్టీ అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ వర్గానికే ‘బాణం- విల్లంబులు’ గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 21: రాజ్యాంగపరమైన అంశాలను సవాలు చేస్తూ ఉద్ధవ్‌ ఠాక్రే, శిందే వర్గాలు దాఖలు చేసిన పలు పిటిషన్ల తుది విచారణను సుప్రీం ధర్మాసనం మొదలుపెట్టింది.

మార్చి 16: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి శివసేనలోని ఇరు వర్గాలు వేసిన పిటిషన్ల విచారణ పూర్తిచేసిన సుప్రీం ధర్మాసనం.. వాటి తీర్పును రిజర్వులో ఉంచింది.

మే 11: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే కొనసాగవచ్చని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. బలపరీక్షను ఎదుర్కోకుండా ఉద్ధవ్‌ ఠాక్రే స్వచ్ఛందంగా రాజీనామా చేసినందున మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించలేమని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని