New Parliament: నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్‌ చేస్తాం: టీఎంసీ, ఆప్‌, సీపీఐ

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పలు విపక్ష పార్టీలు బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌, సీపీఐ తెలపగా.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ ప్రకటించింది.

Published : 23 May 2023 23:19 IST

దిల్లీ: నూతన పార్లమెంట్‌ భవనాన్ని (New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కాకుండా.. రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC), ఆప్‌(AAP), సీపీఐ (CPI) పార్టీలు మే 28న జరిగే పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్‌కాట్‌ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు టీఎంసీ లోక్‌సభాపక్ష నేత సుదీప్‌ బంధోపాధ్యాయ ఒక ప్రకటన చేయగా.. ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. అలాగే, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా సైతం పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తామూ వెళ్లబోవడంలేదని చెప్పారు.

‘‘మే 28న జరిగే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించాం. పార్లమెంట్ నూతన భవనాన్ని స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం లేదా గాంధీ జయంతి రోజున ప్రారంభించాలి. అలాకాకుండా వీడీ సావర్కర్‌ జయంతి రోజు ఈ కార్యక్రమం నిర్వహించకూడదు’’ అని సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ అన్నారు.  ‘‘పార్లమెంట్ అనేది కేవలం భవనం మాత్రమే కాదు. అది పాత సంప్రదాయాలు, విలువలు, నియమాలతో కూడినది. ఇది భారత ప్రజాస్వామ్యానికి పునాది. దాని గురించి ప్రధానికి అర్థం కాదు. ఆయన నేను, నేనే.. అనే భావనతో ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. కాబట్టి, అందులోంచి మమ్మల్ని మినహాయించండి’’ టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఒబ్రెయిన్‌ ట్వీట్ చేశారు. 

సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం.. కాంగ్రెస్‌

శిలాఫలకాలపై పేరు కోసమే ప్రధాని మోదీ, దేశ అత్యున్నత స్థానంలో ఉన్న గిరిజన మహిళను అవమానిస్తున్నారని కాంగ్రెస్‌ ( Congress) పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ విమర్శించారు.‘‘కేంద్రానికి నాదో ప్రశ్న. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరురాలు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పే పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతితో కాకుండా ప్రధాని ఎందుకు ప్రారంభిస్తున్నారు? ఎందుకు అత్యున్నత స్థానంలో ఉన్న ఒక గిరిజన మహిళను అవమానిస్తున్నారు?  శిలాఫలకాలపై పేరు కోసమే ప్రధాని తాపత్రయం. ఈ కార్యక్రమానికి హాజరు కావాలా? వద్దా? అనే దానిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’ అని గౌరవ్‌ తెలిపారు. 

మరోవైపు, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి ఎంపీలకు డిజిటల్‌ ఆహ్వానాలు అందుతుండటంతో కార్యక్రమానికి హాజరు కావాలా? వద్దా? అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. భావసారూప్యం కలిగిన విపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నాయి. దీనిపై త్వరలోనే విపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్లు సంయుక్తంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు