‘మా పార్టీని గెలిపిస్తే.. ప్రతి ఇంట్లో మహిళకు నెల నెలా ₹5వేలు జమ’

మరికొన్ని నెలల్లోనే గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ  రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. జనాకర్షక పథకాలతో ఓట్లను కొల్లగొట్టి....

Updated : 11 Dec 2021 16:26 IST

గోవా మహిళా ఓటర్లకు టీఎంసీ హామీ

పనాజీ: మరికొన్ని నెలల్లోనే గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ  రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. జనాకర్షక పథకాలతో ఓట్లను కొల్లగొట్టి అధికార పీఠం అందుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈసారి గోవాలో పాగా వేయడమే లక్ష్యంగా దూకుడుతో ముందుకెళ్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌.. మహిళలకు అదిరిపోయే హామీ ఇచ్చింది. తమ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే ప్రతి కుటుంబంలోని మహిళకు గృహలక్ష్మీ పథకం కింద నెలకు ₹5000 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తామని టీఎంసీ పార్టీ గోవా వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఎంపీ మెహువా మొయిత్రా శనివారం హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన కార్డుల్ని పంపిణీ చేస్తామన్నారు.ఈ కార్డులపై ఉన్న యూనిక్‌ ఐడింటిఫికేషన్‌ నంబర్లు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలులోకి వస్తాయన్నారు.

ఈ పథకం గోవాలోని 3.5 లక్షల కుటుంబాలకు చెందిన మహిళలందరికీ వర్తిస్తుందని మెహువా స్పష్టంచేశారు. ప్రస్తుతం భాజపా ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న గృహ ఆధార్‌ పథకంలో గరిష్ఠ ఆదాయ పరిమితిని కూడా తాము తొలగిస్తామన్నారు. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం మహిళలకు కేవలం ₹1500 మాత్రమే ఇస్తోందని చెప్పారు. వాస్తవానికి గృహ ఆధార్‌ పథకం అమలుకు ఏడాదికి ₹270 కోట్లు కావాల్సి ఉన్నప్పటికీ.. గోవా ప్రభుత్వం కేవలం ₹140 కోట్లు మాత్రమే కేటాయించడంతో చాలా మంది లబ్ధి పొందలేకపోతున్నారని ఎంపీ ఆరోపించారు. తాము తీసుకురాబోయే ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్‌లో ఆరు నుంచి ఎనిమిది శాతం నిధుల్ని ఖర్చు చేస్తామన్నారు. మరోవైపు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ వచ్చే గోవా ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల నుంచి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Political News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని