Rajya sabha: రాజ్యసభలో మళ్లీ ఉద్రిక్తత.. ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ సస్పెన్షన్‌!

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ .....

Published : 21 Dec 2021 21:25 IST

దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో తాజాగా మరో ఎంపీపై సస్పెన్షన్‌ వేటు పడింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ డెరెక్‌ ఒబ్రెయిన్‌ రూల్‌ పుస్తకాన్ని సభాపతి స్థానం వైపు విసరడంతో ఆయన్ను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇటీవల 12మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని, కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణల బిల్లును నిరసిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం కూడా సభలో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఛైర్మన్‌ స్థానంలో సస్మిత్‌ పాత్రా ఉన్నారు. రూల్‌ బుక్‌ సభాపతి స్థానం వైపు విసరడంతో డెరెక్‌ను సస్పెండ్‌ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్‌ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో ఆయన్ను ఈ సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారు. 

తనను సస్పెండ్‌ చేయడంపై ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌ ట్విటర్‌లో స్పందించారు. గతంలో వ్యవసాయ చట్టాల్ని కేంద్రం బలవంతంగా తీసుకొచ్చిన సందర్భంలోనూ తాను రాజ్యసభ నుంచి సస్పెండైన విషయాన్ని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆ చట్టాల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఈరోజు పార్లమెంట్‌ని భాజపా అపహాస్యం చేయడం, ఎన్నికల సంస్కరణల బిల్లుని తీసుకురావడంపై నిరసన వ్యక్తంచేస్తుంటే సస్పెండ్‌ చేశారన్నారు. ఈ బిల్లు కూడా త్వరలోనే రద్దు చేస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు