
Sushmita Dev: రాజ్యసభకు సుస్మితా దేవ్.. నామినేట్ చేసిన టీఎంసీ
దిల్లీ: కాంగ్రెస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన సుస్మితా దేవ్‌ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు టీఎంసీ పార్టీ మంగళవారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘‘సుస్మితా దేవ్‌ను పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మహిళా సాధికారత కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎల్లప్పుడూ కృషి చేస్తారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేలా చూస్తారు. అప్పుడే సమాజం మరింత అభివృద్ధి సాధిస్తుందని విశ్వసిస్తారు’’ అని టీఎంసీ ట్విటర్లో పేర్కొంది. తనను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల సుస్మిత ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె గతంలో అస్సాంలోని సిల్చార్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
గత నెల సుస్మిత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఆమెకు అస్సాం, త్రిపురలో పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న సుస్మిత.. పార్టీ వీడటంతో ఈశాన్య రాష్ట్రాల్లో హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆమె తండ్రి దివంగత సంతోశ్ మోహన్ దేవ్ అస్సాంలో అత్యంత ప్రజాదరణ ఉన్న కాంగ్రెస్ నేత.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.