తృణమూల్‌కు మరో మంత్రి గుడ్‌బై

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్‌ నుంచి భాజపా వైపు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఆ పార్టీని వీడి భాజపాలో చేరగా.. ఇటీవలే మంత్రి పదవికి రాజీనామా చేసిన....

Updated : 29 Jan 2021 19:15 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్‌ నుంచి భాజపా వైపు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఆ పార్టీని వీడి భాజపాలో చేరగా.. ఇటీవలే మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజీవ్‌ బెనర్జీ సైతం అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది! తాజాగా ఆయన శాసనసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. తొలుత స్పీకర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన రాజీవ్‌.. కొన్ని గంటల వ్యవధిలో ‘దిస్‌ చాప్టర్‌ ఈజ్‌ ఓవర్‌’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

దోమ్‌జూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజీవ్‌.. ఇటీవలే మంత్రి (అటవీ శాఖ) పదవికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూ దోమ్‌జూర్‌ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించి రాజ్‌భవన్‌ నుంచి వస్తున్న సమయంలో ఆయన ఒకింత ఉద్విగ్నానికి లోనవ్వడం కనిపించింది. అలాగే, అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ మమతా బెనర్జీ చిత్ర పటంతో ఆయన కనిపించడంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. భాజపాలో చేరే విషయాన్ని సైతం ఆయన తోసిపుచ్చారు. అయితే, ఆదివారం హోంమంత్రి అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో రాజీవ్‌ రాజీనామా చేయడంతో భాజపాలో ఆయన చేరుతారన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దీదీ మంత్రివర్గంలో పనిచేసిన సువేందు అధికారి, లక్ష్మణ్‌ రతన్‌ శుక్లా భాజపాలో చేరారు. మరి రాజీవ్‌ ఎటువైపు అడుగులు వేస్తారో!!

ఇవీ చదవండి..
సాగుచట్టాల రద్దుకు బెంగాల్‌ అసెంబ్లీ తీర్మానం
బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ పొత్తు కుదిరింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని