Job Scam: ఆ మంత్రి అరెస్టు వ్యవహారంలో జోక్యం చేసుకోం: టీఎంసీ

పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Job scam case)లో మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సీనియర్‌ నేత పార్థా ఛటర్జీ......

Published : 25 Jul 2022 02:06 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Job scam case)లో మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సీనియర్‌ నేత పార్థా ఛటర్జీ (Partha Chatterjee) అరెస్టుపై ఆ పార్టీ తాజాగా స్పందించింది. ఈ కేసు విచారణను ఈడీ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని డిమాండ్‌ చేసింది. తప్పుచేసిన వారు ఎంత పెద్ద నేత అయినా తమ పార్టీ రాజకీయంగా జోక్యం చేసుకోబోదని తేల్చి చెప్పింది. జులై 22న బెంగాల్‌లోని పలుచోట్ల సోదాలు జరిపిన ఈడీ అధికారులు నిన్న మంత్రితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేయడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అరెస్టయిన మంత్రి పార్థా ఛటర్జీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కావడం గమనార్హం.

అయితే, ఈ వ్యవహారంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈడీ సోదాల్లో సినీనటి, మోడల్‌ అర్పితా ముఖర్జీ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు బయటపడగా.. ఆమెతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కునాల్‌ ఘోష్‌ స్పష్టంచేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని కేసులను ఏళ్ల తరబడి విచారిస్తున్నాయని పేర్కొన్న ఆయన.. ఈ కేసును నిర్ణీత కాల వ్యవధిలోనే ఈడీ పూర్తి చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. తప్పుచేసిన వారు ఎంత పెద్ద నేత అయినా తృణమూల్‌ కాంగ్రెస్‌ జోక్యం చేసుకోబోదన్నారు. మరోవైపు, బెంగాల్‌లో రూ.కోట్ల విలువైన శారదా చిట్ ఫండ్ స్కాం కేసు 2014 నుంచి సీబీఐ విచారిస్తుండగా.. 2016లో బయటపడిన నారదా టేపుల కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాని సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని