West Bengal: పార్టీ వీడి తప్పు చేశాను.. క్షమించండి

పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) పార్టీని వీడి భాజపాలో చేరిన పలువురు నేతలు మళ్లీ సొంత గూటికి చేరాలని భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నేతలు తిరిగి టీఎంసీలో ....

Published : 02 Jun 2021 01:10 IST

మమతకు లేఖ రాసిన మరో మాజీ టీఎంసీ నేత


(Pic: dipendu biswas twitter)

కోల్‌కతా: పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) పార్టీని వీడి భాజపాలో చేరిన పలువురు నేతలు మళ్లీ సొంతగూటికి చేరాలని భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నేతలు తిరిగి టీఎంసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖలు రాయగా.. ఆ జాబితాలో తాజాగా మరో నేత దీపేందు విశ్వాస్‌ కూడా చేరారు. పార్టీని వీడి తప్పు చేశానని, భాజపాలో చేరడం తన తప్పుడు నిర్ణయమని లేఖలో వాపోయారు. 

ఇటీవల పశ్చిమ్‌ బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగగా భాజపాపై టీఎంసీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు భాజపాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావించి కొందరు నేతలు టీఎంసీకి రాజీనామా చేసి అందులో చేరారు. కానీ, వారొకటి అనుకుంటే మరొకటి జరిగింది. దీంతో అధికారం దక్కించుకున్న టీఎంసీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బసిరత్‌ దక్షిణ్‌ మాజీ ఎమ్మెల్యే దీపేందు బిశ్వాస్‌.. దీదీకి లేఖ రాశారు. ‘‘ఎన్నికల్లో నాకు సీటు కేటాయించకపోవడంతో నిరాశకు గురై భాజపాలో చేరాను. అది నా తప్పుడు నిర్ణయం. పార్టీ వీడి తప్పు చేశాను. క్షమించండి. తిరిగి టీఎంసీ పార్టీలో చేరే అవకాశం ఇవ్వండి. నా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాను’’ అని దీపేందు పేర్కొన్నారు.

అంతకుముందు టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ కూడా ‘‘దీదీ మీరు లేకుండా బతకలేను. పార్టీ వీడి తప్పు చేశా. క్షమించి.. తిరిగి పార్టీలోకి చేర్చుకోండి’’ అంటూ మమతకు లేఖ రాశారు. అలాగే, మాజీ టీఎంసీ నేతలు సరళ ముర్ము, అమోల్‌ ఆచార్య కూడా టీఎంసీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని