TN cabinet: స్టాలిన్‌ కేబినెట్‌లో మార్పులు.. ఆర్థికశాఖ నుంచి పీటీఆర్‌ ఔట్‌!

Tamil Nadu cabinet: తమిళనాడు కేబినెట్‌ నుంచి కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతల నుంచి త్యాగరాజన్‌ను స్టాలిన్‌ తప్పించారు. ఆయనకు ఐటీ శాఖ కేటాయించారు. మరికొందరి శాఖలను సైతం మార్చారు.

Published : 12 May 2023 01:28 IST

చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్‌ (Stalin) తన మంత్రివర్గాన్ని మరోసారి పునర్‌వ్యవస్థీకరించారు. కొంతమంది మంత్రుల శాఖలను మార్చారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న పీటీఆర్‌గా (PTR) పేరొందిన పళనివేల్ త్యాగరాజన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనకు ఐటీ శాఖ కేటాయించారు. ఆయన స్థానంలో తంగం తెన్నరసుకు ఆ బాధ్యతలు అప్పగించారు. తమిళనాట ఆడియో టేపుల వ్యవహారం బయటకొచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2021లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన త్యాగరాజన్‌ ఆర్థిక మంత్రిగా తనదైన ముద్ర వేశారు. కేంద్రంపై విమర్శలు చేయడం ద్వారా గుర్తింపు పొందారు. అయితే, మేనిఫెస్టోలో పేర్కొన్న పాత పెన్షన్‌ విధానం గురించి త్యాగరాజన్‌ సుముఖంగా లేకపోవడం పట్ల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆయనపై వ్యతిరేకత ఉంది. కార్పొరేట్‌ తరహా ఆర్థిక విధానాలను ఆయన అవలంబిస్తున్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఓ వర్గం పార్టీ నేతలు సైతం ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భాజపా ఆడియో టేపుల వ్యవహారం ఆయనను ఇరుకున పెట్టింది. డీఎంకేకు చెందిన కీలక నేతల ఆస్తుల గురించి త్యాగరాజన్‌ మాట్లాడినట్లుగా అందులో ఉంది. ఆ సంభాషణలు తనవి కావని త్యాగరాజన్‌ ఖండించారు.

ఈ నేపథ్యంలో స్టాలిన్‌ తన మంత్రివర్గంలో మార్పులు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తంగం తెన్నరసుకు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. త్యాగరాజన్‌కు ఐటీ శాఖ అప్పగించిన స్టాలిన్‌.. ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్‌ను మిల్క్‌, డెయిరీ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు మార్చారు. ఆ స్థానంలో ఉన్న ఎస్‌ఎం నాసర్‌ను కేబినెట్‌ నుంచి తప్పించారు. కొత్తగా టీఆర్‌బీ రాజాను మంత్రి వర్గంలోకి తీసుకుని పరిశ్రమల శాఖ అప్పగించారు. ఎంపీ సామినాథన్‌కు ఇన్ఫర్మేషన్‌, పబ్లిసిటీ శాఖతో పాటు తమిళ్‌ డెవలప్‌మెంట్‌ శాఖను సైతం కేటాయించారు. మంత్రులంతా గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

తనకు ఐటీ శాఖ కేటాయించిన అనంతరం త్యాగరాజన్‌ ట్వీట్‌ చేశారు. స్టాలిన్‌ నేతృత్వంలో రెండేళ్ల పాటు ఆర్థిక శాఖను సమర్థంగా నడిపించానని, ఐటీ శాఖను సైతం అదే చిత్తశుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు. మరోవైపు మంత్రివర్గ మార్పుపై భాజపా విమర్శలు గుప్పించింది. పీటీఆర్‌ను ఆడియో టేపుల వల్లే తప్పించారని, ఒకవేళ అదే కారణం కాకపోతే అసమర్థుడైన వ్యక్తికి ఆర్థిక శాఖను అప్పగించినందుకు స్టాలిన్‌ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని