Gujarat Polls 2022: గుజరాత్‌ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే 10 అంశాలివే!

22ఏళ్ల పాటు వరుస విజయాలతో గుజరాత్‌ పీఠాన్ని ఏలుతోన్న కమలనాథులు.. ఈసారి కూడా తమ కంచుకోటను పదిలం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా.. పూర్వ వైభవాన్ని చాటాలని కాంగ్రెస్‌ శ్రమిస్తోంది. అయితే, ఇటీవల పంజాబ్‌లో అపూర్వ విజయంతో మంచి ఊపుమీద ఉన్న ఆప్‌.. ప్రధాని మోదీ, అమిత్‌ షాల సొంత రాష్ట్రంలోనూ విజయ బావుటా ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. గుజరాత్‌ ఓటర్లు ఎటువైపు నిలబడతారో చూడాలి.

Updated : 04 Nov 2022 08:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly polls)కు నగారా మోగింది. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీ(Gujarat Assembly)కి డిసెంబర్‌ తొలి వారంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్న రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్త్రాలకు మరింత పదును పెట్టనున్నాయి. 22ఏళ్ల పాటు వరుస విజయాలతో గుజరాత్‌ పీఠాన్ని ఏలుతున్న కమలనాథులు.. ఈసారి కూడా తమ కంచుకోటను పదిలం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా.. పూర్వ వైభవాన్ని చాటాలని కాంగ్రెస్‌ శ్రమిస్తోంది. అయితే, ఇటీవల పంజాబ్‌లో అపూర్వ విజయంతో మంచి ఊపుమీద ఉన్న ఆప్‌.. ప్రధాని మోదీ, అమిత్‌ షాల సొంత రాష్ట్రంలోనూ విజయ బావుటా ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. గుజరాత్‌ ఎన్నికలపై ప్రధానంగా 10 అంశాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  1. నరేంద్ర మోదీ: భాజపాకు ప్రధాని నరేంద్ర మోదీనే ఓ ట్రంప్‌ కార్డ్‌. గుజరాత్‌ సీఎంగా, ప్రధానిగా ఆయనకు ఉన్న ఛరిష్మానే భాజపాకు పెద్ద బలం. 2001 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ గుజరాత్‌ పీఠాన్ని వీడి ఎనిమిదేళ్లు గడిచినా సొంత రాష్ట్రంలో మాత్రం ఆయనకు ఫాలోయింగ్‌ చెక్కుచెదరలేదు. వచ్చే ఎన్నికల్లో మోదీనే ఓ పెద్ద డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ అవుతారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
  2. బిల్కిస్‌ బానో కేసు.. 2002 నాటి గోద్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులు శిక్షపూర్తి కాకుండానే సత్ప్రవర్తనపై జైలు నుంచి విడుదల కావడం, వారికి కొందరు సన్మానాలు చేయడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సంఘ్‌పరివార్‌కు హిందుత్వ ప్రయోగశాలగా పిలిచే గుజరాత్ ఎన్నికల్లో ఈ అంశం కూడా కీలక ఫ్యాక్టర్‌ కానుంది. బిల్కిస్ బానో కేసులో దోషులు విడుదలైన వ్యవహారం మెజారిటీ, మైనార్టీ వర్గాల మధ్య విభిన్నమైన ప్రభావాన్ని చూపుతోంది. ముస్లిం సామాజిక వర్గాలు వారు బిల్కిస్‌ బానోకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తుండగా.. హిందువులలో ఒక వర్గం దీన్ని విస్మరిస్తోంది.
  3. ప్రభుత్వ వ్యతిరేకత: 1998 నుంచి వరుస విజయాలతో గుజరాత్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తూ తిరుగులేని శక్తిగా ఉన్న భాజపా ప్రభుత్వం పట్ల  కొన్ని వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకతే ఉంది. 24ఏళ్ల పాటు రాష్ట్రంలో భాజపా సుదీర్ఘ పాలన ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లో ఇంత సుదీర్ఘకాలంగా  భాజపా పాలనలో ఉన్నా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కొన్ని ప్రజా సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకుడు హరి దేశాయ్‌ తెలిపారు. నిరుద్యోగ సమస్య నెలకొన్నందున యువత ఆసారి ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనే అంశం కీలకంగా మారింది.
  4. మోర్బీ విషాదం: అక్టోబర్‌ 30న గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో తీగల వంతెన కూలిన ఘటన దేశ వ్యాప్తంగా విషాదం రేపింది.ఈ ఘటనలో 135మందికి పైగా మృతి చెందగా.. అనేకమంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ప్రభుత్వ పాలనాయంత్రాంగం, ధనిక వ్యాపారవేత్తల మధ్య అనుబంధాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకొనేందుకు ఓటేసే ప్రజల్లో ఈ అంశం కూడా కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. 
  5. అధిక విద్యుత్‌ ఛార్జీలు: దేశంలో అత్యధిక విద్యుత్‌ టారిఫ్‌లు కలిగిన రాష్ట్రాల్లో గుజరాత్‌ కూడా ఒకటి. దీంతో అక్కడి ప్రజలు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా అందిస్తామంటోన్న ఆప్‌, కాంగ్రెస్‌ల ఆఫర్లను ఆసక్తిగా గమనిస్తున్నారు.  దక్షిణ గుజరాత్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఇటీవల కమర్షియల్‌ విద్యుత్‌ టారిఫ్‌లను తగ్గించాలని డిమాండ్‌ చేసింది. యూనిట్‌కు తాము తాము రూ.7.50 చొప్పున చెల్లిస్తుండగా.. మహారాష్ట్ర, తెలంగాణలలో పరిశ్రమల యజమానులు యూనిట్‌కు రూ.4 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొంది. 
  6. పేపర్‌ లీకేజీలు/పరీక్ష వాయిదాలు: గుజరాత్‌లో ఇటీవల తరచూ పరీక్ష పేపర్లు లీక్‌ కావడం, ప్రభుత్వ నియామక పరీక్షలు వాయిదా పడటం వంటి వ్యవహారాలు అక్కడి యువతలోనిరాశను పెంచాయి. ఈ పరిణామాలు పోటీ పరీక్షల కోసం ఎంతో కష్టపడి సన్నద్ధమైన యువత ఆశలపై నీళ్లు చల్లేలా పరిణమించడంతో యువత అసంతృప్తితో ఉన్నారు.  అందువల్ల ఈ అంశం కూడా కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
  7. విద్య/ఆరోగ్యం: గుజరాత్‌లోని మారుమూల ప్రాంతాల్లో కనీస విద్య, వైద్య సదుపాయాలు అందకపోవడం ఈ ఎన్నికల్లో ప్రభావిత అంశం కానుంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తరగతి గదులుంటే.. ఉపాధ్యాయుల్లేరు.. ఉపాధ్యాయుల్ని నియమిస్తే.. తరగతి గదుల కొరత ఉండటంతో విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యులు సరిగా ఏలకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 
  8. రోడ్ల దుస్థితి: గుజరాత్‌ రోడ్లు గతంలో ఎంతో నాణ్యతతో ఉండేవి. కానీ, గత ఐదారేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్‌ కార్పొరేషన్లు రోడ్ల నిర్మాణాన్ని, నిర్వహణను పట్టించుకోవడంలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయమైన రోడ్లపై ఫిర్యాదులు సర్వసాధారణంగా మారిపోయాయి.
  9. భూసేకరణ: పలు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు సేకరించడం రైతులు, భూ యజమానుల్లో అసంతృప్తికి గురిచేస్తోంది. ఉదాహరణకు.. అహ్మదాబాద్ -ముంబయి మధ్య హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణను పలుచోట్ల రైతులు వ్యతిరేకించడంతో ఆ ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా ముందుకు కదలడంలేదు. అలాగే, వడోదర- ముంబయి మధ్య ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు కోసం జరుపుతున్న భూసేకరణను కూడా ఆయా ప్రాంతాల్లో కొందరు రైతులు వ్యతిరేకిస్తున్నారు.
  10. రైతాంగ సమస్యలు: రైతుల అంశం కూడా ఈ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా అధిక వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని