Karnataka politics: సీఎం సీటుపై అధిష్ఠానం నిర్ణయం.. కర్ణాటక కాంగ్రెస్‌లో మొదలైన విభేదాలు

సీఎం, డిప్యూటీసీఎంల విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ సీనియర్‌ నేత పరమేశ్వర (Parameshwara) డిమాండ్‌ చేస్తున్నారు.

Updated : 18 May 2023 19:39 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Eelctions) 135 స్థానాలు గెలుచుకొని జోరు మీదున్న కాంగ్రెస్‌ను (Congress) అంతర్గత సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఇవాళ్టి వరకు సీఎం సీటుపై తర్జనభర్జనలు పడిన హస్తం పార్టీ.. సమస్యను ఎట్టకేలకు ఓ కొలిక్కి తీసుకొచ్చింది. అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యను (Siddha ramaiah) ముఖ్యమంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఏకైక ఉపముఖ్యమంత్రిగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. కానీ, అధిష్ఠానం నిర్ణయం కొన్ని వర్గాలకు మింగుడు పడటం లేదు. అధిష్ఠానం నిర్ణయంపై సీనియర్‌ నేత జి. పరమేశ్వర అసంతృప్తి వెలిబుచ్చారు. దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

71 ఏళ్ల పరమేశ్వర కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అధికారంలో ఉన్న సమయంలో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. అంతేకాకుండా గతంలో కేపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 8 ఏళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్‌ కోసం పని చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆశావహుల్లో ఆయన కూడా ఒకరు. అయితే, ఏకైక ఉపముఖ్యమంత్రి ఉంటారంటూ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడుతున్నారు. ‘‘ తానొక్కరే డిప్యూటీ సీఎంగా ఉండాలని డీకే శివకుమార్‌ కేంద్రానికి షరతు పెట్టడం ఆయన దృష్టిలో సబబే కావొచ్చు. కానీ, అధిష్ఠానం లోతుగా ఆలోచించాలి. తమ నిర్ణయం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో  బేరీజు వేసుకోవాలి.’’ అని పరమేశ్వర మీడియాకు తెలిపారు.

పార్టీ అధికారంలోకి వస్తే ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని ఎంతోమంది దళితులు ఆశలు పెట్టుకున్నారని, ఒకవేళ అలా జరగకపోతే దళితులకు అన్యాయం జరిగినట్లేని పరమేశ్వర అన్నారు. ‘‘ లోటుపాట్లు అర్థం చేసుకొని పార్టీ హైకమాండ్‌ ఓ నిర్ణయం తీసుకోవాలి. అలా జరగనప్పుడు కచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. ఇప్పటికైనా అధిష్ఠానం పునరాలోచించి నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిది. లేదంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. నేతలు దీనిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.’’ అని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం పదవులకు తాను కూడా అర్హుడునేనని అయితే, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించానని చెప్పారు. ఇప్పటికి కేవలం 2 పదవులను మాత్రమే ప్రకటించిన అధిష్ఠానం.. క్యాబినెట్‌ విస్తరణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానని అన్నారు. 

పరమేశ్వర తుముకూరు జిల్లాలోని కొరాటగిరే అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో  2013 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అప్పట్లో సీఎం రేసులో ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కల నెరవేరలేదు. అనంతరం ఎమ్మెల్సీగా గెలిచి.. సిద్ధరామయ్య ప్రభుత్వంలో (2013-2018) మంత్రిగా సేవలు అందించారు. తాజా ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి, జేడీఎస్‌ అభ్యర్థి సుధాకర్‌ లాల్‌పై 14,347 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని