Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి..ఆసక్తి రేపుతున్న శివసేన నేతల వ్యాఖ్యలు!

మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి మొదలవుతోంది. శిందే నేతృత్వంలోని శివసేన నాయకులపై భాజపా సవతితల్లి ప్రేమ కనబరుస్తోందని ఠాక్రే వర్గీయులు చెబుతున్నారు. భాజపా ప్రేమను తట్టుకోలేక 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన అధికార పత్రిక సామ్నాలో రాసుకొచ్చారు.

Published : 31 May 2023 01:17 IST

ముంబయి: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై భాజపా (ñBJP) సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఎద్దేవా చేసింది. ఆ ప్రేమతో ఉక్కిరిబిక్కిరైన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తన అధికార పత్రిక సామ్నా పేర్కొంది. శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు భాజపా దృష్టిలో కోళ్లలాంటి వారని, ఎప్పటి వరకు పెంచుకుంటారో? చెప్పలేమని పేర్కొంది. 2019లో పూర్వపు శివసేన భాజపాతో సంబంధాలు తెంచుకున్న సమయంలోనూ సామ్నా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

ఠాక్రేలను మోసం చేసిన శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు భాజపాతో చేతులు కలిపారని, మోజు తీరిపోవడంతో ఇప్పుడు విడాకుల చర్చలు మొదలయ్యాయని సంపాదకీయంలో రాసుకొచ్చింది. ఇటీవల శివసేన ఎంపీ గజానన్‌ కీర్తికర్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భాజపా తమపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని వ్యాఖ్యానించడం సామ్నా కథనానికి మరింత ఊతమిస్తోంది. ‘‘ మేము ఎన్డీయే ప్రభుత్వంలో భాగమే. మా పని తీరుకు గుర్తింపు కూడా అలాగే ఉండాలి. భాజపా నేతలతో పోల్చుకున్నప్పుడు తేడా కనిపించకూడదు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. మా నేతలు సవతితల్లి ప్రేమను పొందుతున్నారు.’’ అని గజానన్‌ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలను ఠాక్రే వర్గం అస్త్రాలుగా మలుచుకుంది. పార్టీని రూపుమాపేందుకు భాజపా ప్రయత్నిస్తోందని శివసేన గుర్తించిందని, అందుకే ఈ మధ్య కాలంతో దూరం పాటిస్తోందని సామ్నా పత్రిక ఎడిటర్‌, ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. ‘‘భాజపా ఓ అనకొండలాంటిది. దాని దగ్గరికి ఎవరు వెళ్లినా మింగేస్తుంది. శివసేన నాయకులకు ఇప్పుడది అర్థమవుతోంది. గతంలో ఆ పార్టీని ఎందుకు దూరం పెట్టామో తెలుస్తోంది.’’ అని సంజయ్‌రౌత్‌ తెలిపారు. 

2019లో తన చిరకాల మిత్రపార్టీ భాజపాతో శివసేన పొత్తును రద్దు చేసుకుంది. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి మహావికాస్‌ అఘాడీని ఏర్పాటు చేసింది. అయితే, శిందే రూపంలో సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో గత ఏడాదే శివసేన రెండుగా విడిపోయింది. తీవ్ర చర్చోపచర్చలు, న్యాయస్థానాల జోక్యం తర్వాత శిందే వర్గానిదే అసలైన శివసేన అని ఎన్నికల సంఘం గుర్తించింది. ఠాక్రే వర్గానికి ప్రత్యేక పేరు, పార్టీ గుర్తులను కేటాయించింది. తాజాగా శిందే వర్గానికి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో మహారాష్ట్రలో మరోసారి రాజకీయ అలజడి మొదలైనట్టయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని