Gujarat polls: 89 స్థానాలు.. 788మంది అభ్యర్థులు.. ఆ సీటులో 44మంది పోటీ!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు(Gujarat Assembly polls2022) ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

Published : 19 Nov 2022 02:17 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు (Gujarat Assembly polls2022) ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈసారి జరుగుతున్న త్రిముఖ సమరంలో తలపడేందుకు ఆయా రాజకీయ పార్టీలు తమ గెలుపు గుర్రాల్ని బరిలో దించాయి. తొలి విడతలో 89 స్థానాలకు డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరగనుండగా.. అందుకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో తొలి విడత పోరులో 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు గుజరాత్‌ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వెల్లడించింది. వీరిలో 70మంది మహిళలే ఉన్నట్టు పేర్కొంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ విడతలో పోటీకు మొత్తంగా 39 పార్టీల నుంచి అభ్యర్థులతో పాటు 399 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నట్టు తెలిపారు. సూరత్‌ జిల్లాలోని లింబయత్‌ స్థానానికి మొత్తం 44 మంది అభ్యర్థులు పోటీలో నిలబడుతుండటంతో అక్కడ పోలింగ్‌కు మూడు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించనున్నారు. అలాగే, మోర్బినియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో రెండు యూనిట్లను ఉపయోగిస్తున్నారు.

అధికార భాజపా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ అన్ని స్థానాలనుంచి తమ అభ్యర్థుల్ని బరిలో దించగా.. ఆప్‌ 88 మంది అభ్యర్థులను పోటీలో ఉంచింది. అలాగే, బీఎస్పీ నుంచి 57 మంది ఏఐఎంఐఎం నుంచి ఆరుగురు పోటీలో ఉన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. తొలుత 89 స్థానాలకు మొత్తంగా 1362 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్‌ పత్రాల పరిశీలన (నవంబర్‌ 15) నాటికి ఆ సంఖ్య 999కి పడిపోయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు (నవంబర్‌ 17) ముగిసే నాటికి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 788గా ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, డిసెంబర్‌ 5న 93 సీట్లకు జరిగే రెండో విడత ఎన్నికల్లో ఇప్పటివరకు 1515 నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. రెండో విడత ఎన్నికల నామినేషన్‌ పత్రాల ఉపసంహరణకు ఆఖరి గడువు నవంబర్‌ 21తో ముగియనుందని చెప్పారు. గుజరాత్‌లో మొత్తంగా 182 సీట్లకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని