Ts News: అద్దంకి దయాకర్‌కు షోకాజు నోటీసు: పీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం

తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశంలో..

Published : 02 May 2022 01:44 IST

హైదరాబాద్‌: తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో... చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.  2018లో తాను తుంగతుర్తి నుంచి పోటీ చేయగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామిరెడ్డి దామోదర్‌రెడ్డిలు తనను ఓడించారని పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన అద్దంకి దయాకర్‌ దిల్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు ఈ ముగ్గురిపై విమర్శలు చేశారని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి ఆధారాలతో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై చర్చించిన క్రమశిక్షణ సంఘం ... అద్దంకి దయాకర్‌ పార్టీ నియమావళిని ఉల్లంఘించారని భావించి ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్టు చిన్నారెడ్డి తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసిన మదన్ మోహన్ తన పరిధిలో చేసే కార్యక్రమాలు పార్టీ పేరుతో కాకుండా ఎంవైఎఫ్‌ (మదన్‌ యూత్‌ ఫోర్స్‌) పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారని, దీనిపై కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఇటీవల ఎల్లారెడ్డిలో పార్టీ నాయకులకు సమాచారం లేకుండా ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడాన్ని కూడా తప్పుబట్టిన క్రమశిక్షణ కమిటీ భవిష్యత్‌లో ఇలా చేయకూడదని స్పష్టం చేసింది.

కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌.. ఎంపీ అభ్యర్థి మదన్‌ మోహన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించడం సరికాదని, సస్పెండ్‌ చేసే అధికారం డీసీసీ అధ్యక్షులకు లేదని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఈమేరకు లేఖ రాయాలని కమిటీ నిర్ణయించింది. దుబ్బాక నియోజక వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీకి సంబంధించిన వారిని ఎస్సీ, ఎస్టీ కేసులతో వేధిస్తున్నారని అందిన ఫిర్యాదుపై సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి లేఖ రాయాలని నిర్ణయించింది. జనగామ డీసీసీ అధ్యక్షులు జంగా రఘువరెడ్డి తన పరిధి దాటి వరంగల్ పరిధిలో రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కూడా జంగా రాఘవ రెడ్డి లేఖ రాయాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని