Revanth Reddy: మార్పు కోసమే యాత్ర: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మేడారంలో ‘హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌’ యాత్ర ప్రారంభించారు. ఈసందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, బలహీనవర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ పాదయాత్ర యాత్ర చేపడుతున్నామన్నారు.

Published : 06 Feb 2023 23:28 IST

జయశంకర్‌ భూపాలపల్లి: విభజించు పాలించు అన్న సూత్రంతో సాగిన రాచరిక, బ్రిటీష్‌ లాంటి పాలన రాష్ట్రంలో సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, బలహీనవర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ పాదయాత్ర యాత్ర చేపడుతున్నామన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ఆయన ‘హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌’ యాత్రను ప్రారంభించారు. భారత్‌ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా చేపట్టిన ఈ యాత్రలో భాగంగా తొలిరోజు.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పోరాట గడ్డ మేడారం నుంచి పడిన తొలి అడుగు పాదయాత్ర కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికేనన్నారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి భాజపా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోందని మండిపడ్డారు. ప్రాణాలకు తెగించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర చేశారన్నారు. ‘వైఎస్‌.. చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్‌తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. సమ్మక్క సారలమ్మ సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే ఈ యాత్ర విజయవంతం అయినట్లే’ అని రేవంత్‌ అన్నారు. తెలంగాణ అమరుల ఆత్మఘోష ఇంకా వినిపిస్తోందని, వారి త్యాగాలకు మట్టి కప్పాలని భారాస ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. అప్పుల బాధతో రైతులు, ఉద్యోగాలు రాక యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం, బోధన రుసుం ఇవ్వకుండా పేదలను విద్యకు దూరం చేయడం, భర్తకు పింఛన్‌ ఇస్తే భార్యకు ఇవ్వకపోవడం ఇవన్నీ సంక్షేమమా అని ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్లు, రైతులకు రూ.లక్ష రుణమాఫీ లాంటివి ఇంతవరకు రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రూ.25 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారని.. ఆ లెక్కన ప్రతి నియోజకవర్గానికి రూ.20 వేల కోట్లు రావాలి. ములుగు నియోజకవర్గానికి వచ్చాయా.. ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఆ సొమ్ము రాబందుల సమితి దోచుకుంది వాస్తవం కాదా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 10 శాతం ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే కేసీఆర్‌ లాభం చేకూర్చారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని