Hyd News: అగ్నిపథ్‌తో నియామకాలు.. సైనికులను అవమానపరచడమే: మహేశ్‌కుమార్‌ గౌడ్

రక్షణశాఖలో కాంట్రాక్ట్‌ విధానం తీసుకురావడం దారుణమైన విషయమని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

Published : 19 Jun 2022 14:45 IST


హైదరాబాద్‌: రక్షణశాఖలో కాంట్రాక్ట్‌ విధానం తీసుకురావడం దారుణమైన విషయమని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో నేతలు పాల్గొన్నారు. అగ్నిపథ్‌ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశసేవ చేయాలనుకునే వారికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.

కేవలం పెన్షన్, ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఏకంగా రక్షణ శాఖనే ఎంచుకున్నారంటే దేశ పరిస్థితి ఏ విధంగా దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించడం రక్షణశాఖతో పాటు సైనికులను అవమానపరచడమే అని ఆరోపించారు. దేశ సేవ చేయడానికి ముందుకొచ్చిన సైనికుల నోట్లో మట్టికొట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం మొత్తం అగ్నిపథ్‌పై వ్యతిరేకిస్తోందని.. ఆర్మీని రక్షించుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. సేవ్‌ ఆర్మీ పేరుతో ముందుకు పోవాలని సూచించారు. అగ్నిపథ్‌ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సైనికులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా?అని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని