TDP: వైకాపా ప్రభుత్వం ఒక్క బస్సూ కొనలేదు.. రిపేర్లూ చేయలేదు: మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విజయవాడ బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించారు.

Updated : 20 Jun 2024 13:58 IST

విజయవాడ: నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విజయవాడ బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ అని చెప్పారు. ప్రయాణికులు, ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు, నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

‘‘ఆర్టీసీకి వేలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి.. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కొన్న పరిస్థితి లేదు. ఉన్న బస్సులకూ మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఉండేది. రోడ్ల దుస్థితి మారాలి.. రోడ్లు మారితేనే ప్రయాణికులు సంతోషంగా గమ్య స్థానాలకు చేరతారు. ప్రయాణికులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఉచిత ప్రయాణంపై వచ్చే 15 రోజుల్లో కమిటీ వేస్తాం. రెండు పక్క రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తాం. గత ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీకి, ఉద్యోగులకు నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకపై ఉద్యోగులు చనిపోతే ఇచ్చే అంత్యక్రియల ఖర్చు రూ.15 నుంచి రూ.25 వేలకు పెంచుతాం. దూర ప్రాంతాలకు నడిచే బస్సుల సంఖ్య పెంచుతాం. కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కొంటాం. బస్‌ స్టేషన్లలో భోజన సదుపాయాలు, వాష్‌రూమ్‌లు మెరుగ్గా ఉండేలా చూస్తాం. భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ చేపడతాం. విజయవాడ బస్టాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణంపై అధికారులతో చర్చిస్తాం’’ అని రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని