TMC: గోవా ఎన్నికల్లో తృణమూల్‌ భారీ ఖర్చు.. ఐనా బోణి కొట్టని వైనం

గోవాలో భాజపాతోపాటు ఇతర పార్టీలతో పోలిస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం కోసం అత్యధికంగా రూ.47.53కోట్లు ఖర్చుపెట్టినట్లు ఎన్నికల సంఘం నివేదికలో వెల్లడైంది.

Published : 25 Sep 2022 23:14 IST

దిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. గోవాలో జరిగిన హోరాహోరీ పోరులో భాజపా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌తోపాటు కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీలు పోటీ చేశాయి. ఇందులో అధికారం చేపట్టిన భాజపాతోపాటు ఇతర పార్టీలతో పోలిస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ అత్యధికంగా రూ.47.53కోట్లు ఖర్చుపెట్టినట్లు ఎన్నికల సంఘం నివేదికలో వెల్లడైంది. భారీగా ప్రచారం చేసినప్పటికీ రాష్ట్రంలో దీదీ పార్టీ బోణి కూడా కొట్టలేకపోవడం గమనార్హం.

గోవా ఎన్నికల ప్రచారం కోసం భాజపా రూ.17.75కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికలో వెల్లడించింది. భాజపాకు ఈ ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలుపొందింది. పంజాబ్‌లో విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఇక్కడ రూ.3.5కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఆశించిన ఫలితం పొందలేదు. ఇక కాంగ్రెస్‌ పార్టీ సుమారు రూ.12 కోట్లు ఖర్చు చేసింది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.25లక్షలు, శివసేన రూ.92లక్షలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్చు చేశాయి.

ఇలా అన్ని పార్టీలతో పోలిస్తే ఎన్నికల ప్రచారం కోసం అత్యధికంగా రూ.47కోట్లు ఖర్చు చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సహకారం తీసుకుంది. పార్టీ తరపున 23 మంది అభ్యర్థులను రంగంలోకి దింపినప్పటికీ కనీసం ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు. తనతో కలిసి పోటీ చేసిన మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ మాత్రం రెండుచోట్ల గెలుపొందింది. మరోవైపు 39 అభ్యర్థులను బరిలో నిలిపిన ఆమ్‌ఆద్మీ పార్టీ 3.5కోట్లు ఖర్చు చేసింది. ఆ పార్టీ రెండు సీట్లలో గెలిచింది. కాంగ్రెస్‌ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ తర్వాత అందులో ఎనిమిది మంది భాజపాకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని