Biplab Kumar Deb: త్రిపుర సీఎం బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ రాజీనామా

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

Updated : 14 May 2022 18:03 IST

అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 25ఏళ్ల వామపక్ష పాలనకు తెరదించుతూ రాష్ట్ర పదో ముఖ్యమంత్రిగా 2018 మార్చి తొలి వారంలో బిప్లవ్‌ కుమార్‌ ప్రమాణ్వీకారం చేశారు. త్రిపురలో తొలి భాజపా ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. దేశంలోని యువ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా కొనసాగారు. 

పలు వివాదాస్పద వ్యాఖ్యలతో అనేక సార్లు వార్తల్లో నిలిచిన బిప్లబ్‌పై ఇటీవల కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో సీఎం విఫలమయ్యారంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా చేసింది. మరోవైపు సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు అసమ్మతి సెగ తగిలినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేయాలని హైకమాండ్‌ భావించినట్లు సమాచారం. బిప్లబ్‌ నిన్న దిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చించారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

బిప్లబ్‌ రాజీనామాతో తదుపరి సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మకు రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌, భాజపా జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తావ్డేను కేంద్ర పరిశీలకులుగా రాష్ట్రానికి పంపినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ సాయంత్రం భాజపా శాసనసభాపక్షం సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకోనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని