Tripura Elections: భాజపాతో చర్చలు..తిప్రా మోథా షరతులు

పార్టీ మద్దతుపై భాజపా (BJP)తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు త్రిపుర (Tripura)లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన తిప్రా మోథా (Tipra Motha) వెల్లడించింది. అయితే, కొన్ని నిబంధనలు పెట్టింది.

Published : 06 Mar 2023 00:43 IST

అగర్తల: త్రిపుర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన తిప్రా మోథా.. భాజపాతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, త్రిపుర ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని భాజపా స్పష్టమైన హామీ ఇస్తేనే చర్చలు జరుపుతామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాణిక్య రాజవంశానికి చెందిన ప్రద్యోత్‌ మాణిక్య దెబ్బర్మన్‌ వెల్లడించారు. భాజపాతో చర్చలు జరిపేందుకు రావాంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆహ్వానించిన నేపథ్యంలో ప్రద్యోత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన ప్రకటన విన్నాను. వారు మమ్మల్ని గౌరవంగా పిలిస్తే.. వారితో చర్చలకు కూర్చుంటాం. కానీ, ఏవో పదవులు ఆశించి ఇలా చేయడం లేదు. రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెబితేనే చర్చలు సఫలమవుతాయి.’’ అని దెబ్బర్మన్‌ అన్నారు. త్రిపుర ప్రజల ఆకాంక్షతో, వారి హక్కులను కాపాడేందుకు తిప్రా మోథా పార్టీ ఏర్పాటైందని చెప్పిన దెబ్బర్మన్‌..రాష్ట్ర ప్రజల హక్కులను విస్మరించి త్రిపురను పాలిస్తామనుకుంటే సమస్యలను ఎదుర్కొంటారని పరోక్షంగా హెచ్చరించారు. ప్రజల హక్కులను కాపాడతామనే నమ్మకంతోనే ప్రజలంతా ఓటు వేశారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విషయంలో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

త్రిపుర అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గానూ భాజపా 33 నియోజకవర్గాల్లో విజయం సాధించి..ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 31ను దాటేసింది. అయితే, 13 సీట్లతో తిప్రా మోథా పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్‌-వామపక్షాల కూటమి 14 స్థానాలు సాధించింది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తిప్రా మోథా పార్టీని భాజపా తన వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఆ పార్టీ భాజపాతో కలిసినట్లయితే మొత్తం 46 సీట్లతో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని భాజపా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈశాన్య రాష్ట్రాలకు భాజపా వ్యూహకర్తగా ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తిప్రా మోథా నాయకులను చర్చలకు ఆహ్వానించారు. వారి సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, భాజపా అధిష్ఠానం చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే, అవి రాజ్యాంగబద్ధంగా ఉండాలే తప్ప త్రిపురను వేరు చేసేలా ఉండకూడదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని